Nadendla Bhaskara Rao behind the alliance on -janasena and bjpకొన్ని నెలల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. లేటు వయసులో ఆయనకు రాజకీయాలు, పార్టీ మార్పులు ఏంటి అని అంతా అనుకున్నారు. అయితే బీజేపీ జనసేన పొత్తుకు బీజం అక్కడే పడింది. పొత్తు చర్చలు జరపడానికి ఇరు పార్టీలకు ఒక ఛానల్ దొరికింది. గత నాలుగైదు నెలలుగా తెరవెనుక చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

మొన్న ఆ మధ్య ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల అపాయింటిమెంట్ ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు. అయితే పవన్ కళ్యాణ్ నెమ్మదిగా తన పని తాను చేసుకుని వచ్చాడు. మీడియాకు దూరంగా నాదెండ్ల మనోహర్ తో పావులు కదుపుతూ వచ్చాడని ఢిల్లీ వర్గాల సమాచారం. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పొత్తు పొడిచింది.

ఈ పొత్తు వల్ల ఎన్నికలలో ఈ పార్టీలు ప్రభావం చూపించగలవా అంటే అనుమానమే. అయితే జనసేన కనీసం సోయ లో ఉంటుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ అండగా ఉంటే జనసేన భవిష్వత్తు మీద నాయకులకు గానీ, ప్రజలకు గానీ ఒకింత భరోసా ఉంటుంది. బీజేపీకి తాము ఎంత కాలంగానో వేచి చూస్తున్న జనకర్షక నేత దొరికినట్టే. అయితే ఈ కాంబినేషన్ ఓట్లు రాలుస్తుందా అనేది చూడాలి.

తొందరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు వారికి పరీక్షగా మారబోతున్నాయి. రెండు పార్టీలకు గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. స్థానిక ఎన్నికలలో మెరుగైన ప్రదర్శన చూపడానికి ఇది ఎంతో అవసరం. రెండు వైపులా ఎన్నికల రాజకీయం లో ఆరితేరిన నేత లేకపోవడం కూడా మైనస్ అనే చెప్పుకోవాలి. వీటిని అన్నిటినీ దాటుకుని ఈ పొత్తు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.