Nandamuri Balakrishnaనేడు నారా లోకేష్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు తారకరత్నకి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నందమూరి బాలకృష్ణ మీడియాకి తెలియజేశారు. కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. బీపీ కూడా నార్మల్ (120-80)గానే ఉంది.

అయితే అతని గుండెలో ఎడమవైపు దాదాపు 90 శాతం బ్లాక్ అయ్యినట్లు యాంజియో పరీక్షలో తెలిసింది. మిగతా పారామీటర్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. మెరుగైన వైద్యం కోసం తారకరత్నని బెంగళూరుకి హెలికాఫ్టర్‌ లేదా అంబులెన్సులో తీసుకువెళ్లాలనుకొంటున్నాము. తారకరత్న ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు,” అని బాలకృష్ణ చెప్పారు.

తారకరత్న స్పృహ తప్పిపడిపోగానే అతనికి గుండెపోటు వచ్చిందని గుర్తించిన అంబులెన్సు సిబ్బంది వెంటనే అత్యవసరమైన చికిత్స అందిస్తూ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ వైద్యులు ఆంజియో పరీక్ష చేసి గుండెలో బ్లాకులు ఉన్నట్లు గుర్తించి రక్త ప్రసరణ మెరుగవడానికి అవసరమైన తాత్కాలిక చికిత్స చేశారు. బెంగళూరులో హాస్పిటల్‌లో చేర్చిన తర్వాత అవసరమైతే ఆపరేషన్ చేయవలసి రావచ్చు లేదా స్టంట్స్ వేయవలసి ఉంటుంది.