naa peru surya day 1 collectionsవరుస సమ్మర్ సక్సెస్ లతో మాంచి ఊపుమీదున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అదే ఊపులో “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ మొదటిసారిగా మెగా ఫోన్ చేపట్టి దర్శకత్వం వహించిన చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. మౌత్ టాక్ తో పాటు సినీ విశ్లేషణలు కూడా ‘నా పేరు సూర్య’కు ప్రతికూలంగా వ్యక్తం కాగా, ఈ సినిమా ఓపెనింగ్స్ బన్నీ ‘దువ్వాడ జగన్నాధమ్’ కంటే తక్కువగా ఉన్నాయన్నది ట్రేడ్ టాక్.

ముఖ్యంగా ట్రాకింగ్ సిస్టం ఉన్న యుఎస్ మార్కెట్ లో అయితే ఒక భారీ సినిమాకు ఊహించని స్పందన లభించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాలు యుఎస్ మార్కెట్ లో సత్తా చాటడంతో, అదే కోవలో ‘నా పేరు సూర్య’ కూడా నిలుస్తుందేమోనని ట్రేడ్ వర్గాలు భావించారు. అయితే షాకింగ్ ఫిగర్స్ ట్రేడ్ వర్గాలను పలకరించినున్నట్లుగా సమాచారం. కానీ యుఎస్ కలెక్షన్స్ ఎన్ని వచ్చినప్పటికీ, లాభనష్టాల ప్రశ్న లేకపోవడం ఇక్కడ గమనించదగ్గ అంశం.

ఈ సినిమాను యుఎస్ లో పంపిణీ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాకపోయిన సంగతి బహిరంగమే. దీంతో ‘భరత్ అనే నేను’ సినిమాను రిలీజ్ చేసిన గ్రేట్ ఇండియా సంస్థ సహకారంతో చిత్ర నిర్మాతలే సొంతంగా యుఎస్ లో రిలీజ్ చేసుకున్నారు. దీంతో ఎంత కలెక్షన్స్ వచ్చినా, హక్కుల విషయంలో లాభనష్టాల ఊసు లేకుండా పోయింది. అయితే మరోసారి యుఎస్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ పేలవమైన ప్రదర్శన అభిమానులను కలచివేస్తోంది. సినిమా టాక్, కలెక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ కు మాత్రం ఈ సినిమా ద్వారా నటుడిగా మంచి కీర్తి ప్రతిష్టతలు వచ్చాయి.