naa-nuvve-vs-sammohanamపెద్ద సినిమాల హంగామా ముగియడంతో, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడి మొదలైంది. అయితే వరుసగా అవి కూడా విఫలం అవుతూ ఉండడంతో… ప్రస్తుతం హిట్లు లేక టాలీవుడ్ వెలవెలబోతోంది. దానిని మరింత కొనసాగించే విధంగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “నా నువ్వే” ఫలితం వెలువడింది. విడుదలకు ముందు ప్రామిసింగ్ గా కనపడిన ఈ సినిమాలో విషయం లేదని తేలిపోవడంతో, మరోసారి నందమూరి క్యాంప్ నిరుత్సాహానికి గురికాకతప్పలేదు.

ఈ తరుణంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఘట్టమనేని కాంపౌండ్ నుండి సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రేక్షకుల టాక్ పరంగా భిన్న స్పందనలు వ్యక్తమైనప్పటికీ, యూత్ నుండి మంచి స్పందన లభించడంతో, ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద నిలబడే సినిమాగా నిలుస్తుందన్న నమ్మకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఈ వీకెండ్ గడిస్తే గానీ “సమ్మోహనం” ఫలితం తేలే పరిస్థితి లేదు. గురువారం నాడు రిలీజైన ‘నా నువ్వే’తో పోలిస్తే మాత్రం ‘సమ్మోహనం’ ఓ మెట్టు పైనే ఉంది.

ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం ‘సమ్మోహనం’ సినిమాకు వస్తున్న టాక్ సుధీర్ బాబుకు ఖచ్చితంగా ఊరటనిచ్చేదే. గత చిత్రాలతో పోలిస్తే… నటన పరంగా కూడా సుధీర్ బాబుకు మంచి మార్కులు పడ్డాయి, అలాగే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అదితి రావుకు, తన డబ్బింగ్ కు కూడా విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇక నరేష్ క్యారెక్టర్ కు అయితే అన్ని వర్గాల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. సాంకేతిక విభాగాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలకు అగ్ర తాంబూలం దక్కింది.