Mystery in Jayalalithaa car driver deathతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాలెం జిల్లాలోని అత్తూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే కనకరాజుది ముమ్మాటికే హత్యేనని జయలలిత మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. జయకు చెందిన కడనాడు ఎస్టేట్ లో ఇటేవలే అక్కడి సెక్యూరిటీ గార్డు హత్యకు గురికాగా, ఈ హత్య వెనుక కనకరాజు హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇంతలోనే ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో, కేసు కీలక మలుపు తిరిగినట్టైంది.

జయలలిత బతికున్న సమయంలోనే కనకరాజుపై అనేక ఆరోపణలు వెలువడ్డాయి. జయలలిత పేరును వ్యక్తిగతంగా వినియోగించుకుని, కనకరాజు దుర్వినియోగం చేస్తున్నారని అప్పట్లో ఆరోపణలు రావడంతో, 2012లో జయ ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత కోయంబత్తూరులోని ఓ బేకరీలో పని చేయగా, ఈ క్రమంలో త్రిశూర్ కు చెందిన సయన్ అనే వ్యక్తితో చేతులు కలిపి, కొడనాడ్ ఎస్టేట్ ను దోచుకునేందుకు కనకరాజు పథకం పన్నినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కొడనాడ్ ఎస్టేట్ లోకి ఏప్రిల్ 24న చొరబడి… అక్కడున్న సెక్యూరిటీ గార్డును హతమార్చి ఉంటారనేది పోలీసుల అనుమానం. ఈ కేసుకు సంబంధించి కనకరాజు కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు ప్రారంభించారు. ఇంతలోనే కనకరాజు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, జయ మద్దతుదారును అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక అసలు సూత్రదారులు ఎవరైనా ఉన్నారా? లేక కాకతాళీయంగా జరిగిన సంఘటనలేనా? అన్న విషయం పోలీసుల విచారణ తేలాల్సి ఉంది.