Mysoora Reddy to join in janasena partyరాయలసీమ సీనియర్ నేత మైసూరా రెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చాకా కొద్ది కాలం ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని వార్తలు వచ్చాయి. అయితే ఎందుకో అది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన ఒక లేఖ ఆయన ఆ ప్రయత్నం విరమించుకున్నారని చెప్పేలా ఉంది. రాయలసీమకు ప్రబుత్వం న్యాయం చేయడం లేదని ఆయన అన్నారు. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు శివరామకృష్ణ, మదన్ మోహన్ రెడ్డి లతో కలిసి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు లేఖ రాశారు.

రాయలసీమకు నీటి పంపకాలలో అన్యాయం జరిగిందని రాష్ట్ర విభజనతో రాయలసీమకు ఎక్కువ నష్టం జరిగిందని ఆయన అన్నారు. విభజన తర్వాత కూడా రాజధాని, హైకోర్టు లను కూడా ఒకే చోట పెట్టి మళ్లీ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని న్యాయవాదులు కోరుతున్నా పట్టించుకోవోడం లేదని వారు అన్నారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఇచ్చామని చెప్పడం అసత్యమని ఇప్పటికీ రాయలసీమ కరువుతో అల్లాడుతోందని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ లేఖ క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీ వైపు చూస్తున్నారా అని కడపలో పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ లో ఉన్న మైసూరా ఆ తరువాత టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీ నుండి 2014 ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. 2014 ఎన్నికల పరాజయం తరువాత జగన్ పై తీవ్రమైన విమర్శలు చేసి బయటకు వచ్చారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మళ్ళీ రాజకీయంగా యాక్టీవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. రాయలసీమలో పార్టీ బాగా బలహీనంగా ఉండటంతో ఎవరు వచ్చినా ఆహ్వానించే పరిస్థితి ఉంది జనసేనలో.