Music-Director-Shahsi Preetam attacked by neighbourకృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాభీ’ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన సంగీత దర్శకుడు శశిప్రీతమ్ గుర్తున్నారా… ప్రస్తుతం ఈ ఆకారంలో గుర్తు పట్టలేకపోవచ్చు గానీ, గతంలో కృష్ణవంశీతో అనేక సినిమాలకు పని చేసిన సమయంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు. అలాంటి శశిప్రీతంపై శుక్రవారం నాడు దాడి జరిగింది. ఆ అవతారంలోనిదే ఈ ఫోటో.

2013లో రూరల్ డెవలప్‌మెంట్ డాక్యుమెంటరీ కాంట్రాక్ట్ విషయంలో సంగీత దర్శకుడు శశిప్రీతమ్, అతని పొరుగింట్లో ఉండే భానుప్రసాద్ మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఆ కాంట్రాక్టు శశిప్రీతమ్‌కు దక్కిన నేపథ్యంలో అప్పటి నుంచి వారిద్దరి మధ్య వాగ్వివాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ గొడవ కాస్త ఉధృత రూపం సంతరించుకోవడం, శశిప్రీతంపై దాడికి కారణమైంది.

ఈ దాడిలో శశి ముఖానికి తీవ్రగాయాలు అవ్వగా, అదే అవతారంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం చికిత్స నిమిత్తం శశిని ఆసుపత్రికి తరలించారు. ఒకప్పుడు సంగీత దర్శకుడిగా హల్చల్ చేసిన శశిప్రీతం ప్రస్తుత తరంలో నెలకొన్న పోటీ రీత్యా వెనుక పడడంతో, వ్యాపార లావాదేవీలలో నిమగ్నమైనట్లుగా సమాచారం.