SS-Thaman Top Music Director‘పట్టుకుందల్లా బంగారం’ అన్న మాదిరి తాను సంగీతం అందించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండడంతో పాటు, వ్యక్తిగతంగా ఎంతో కీర్తిప్రతిష్టతలను సొంతం చేసుకుంటున్నాడు ఎస్.ఎస్.థమన్. ‘అఖండ’ మొదలుకుని, మేలో రాబోతున్న ‘సర్కార్ వారి పాట’ సినిమాల వరకు అగ్ర హీరోల సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా, మళ్ళీ ఆ అగ్ర హీరోల సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకుని, తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు థమన్.

అయితే సంగీత దర్శకుడిగానే కాక తాను పని చేసే సినిమాలకు ఓ పీఆర్వోలా వ్యవహరించడం థమన్ స్పెషాలిటీగా మారింది. బహుశా చిత్ర నిర్మాణ సంస్థల నుండి వీటికి కూడా రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నాడో లేదో గానీ, బహుశా పీఆర్వోలు కూడా చేయలేని పబ్లిసిటీని థమన్ తన భుజాలకెత్తుకుని చేస్తున్నాడు. అగ్ర హీరోల సినిమాల అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తుంటారు. కానీ వాటిని సకాలంలో అందించడంలో నిర్మాణ సంస్థల నుండి జాప్యం జరుగుతోంది.

ఇక్కడే థమన్ రంగప్రవేశం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే థమన్, అభిమానుల ఆవేదనను అర్ధం చేసుకుని, అందుకు తగిన విధంగా ఏదొక అప్ డేట్స్ ను అందిస్తున్నారు. ఇటీవల కాలంలో అందరి హీరోల అభిమానులకు థమన్ ఒక్కరే దిక్కయ్యారు అనేలా పరిస్థితులు మారిపోయాయి. ‘అఖండ, భీమ్లా నాయక్’ సినిమాల అప్ డేట్స్ ను అందించి ఫ్యాన్స్ ను శాంతపరిచిన థమన్, ప్రస్తుతం ‘సర్కార్ వారి పాట’ను మోసే పని ఉన్నారు.

ఈ సినిమాకు సంబంధించి రెండో పాట ఆదివారం విడుదల కానున్న నేపధ్యంలో, ప్రోమో ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ప్రొడక్షన్ యూనిట్ ను టార్గెట్ చేసారు. కానీ ప్రొడక్షన్ యూనిట్స్ గానీ, పీఆర్వోలు గానీ ఇవ్వని కిక్ ను సూపర్ స్టార్ అభిమానులకు థమన్ అందించారు. ‘కళావతి’ మాదిరే ఈ పాట కూడా అదిరిపోతుందని, పాటలో ఎనర్జీ మామూలుగా లేదని చెప్తూ ఫ్యాన్స్ ను ఉత్సాహంలో పడేసారు. కనీసం ఈ సమాచారం ఇచ్చారు చాలులే అని సంతృప్తి చెందడం ఫ్యాన్స్ వంతయ్యింది.