DSP-father-diedప్రస్తుతం సంగీత ప్రపంచాన్ని ఊపేస్తున్న యువతరంగం దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి ‘కాలం’ చేసారు. చెన్నైలోని సొంత నివాసంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లుగా తెలుస్తోంది. 61 సంవత్సరాలు ఉన్న సత్యమూర్తి తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 90 సినిమాలకు పైగా చిత్రాలకు కధా రచయితగా పనిచేసారు. అలాగే పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

చంటి, అభిలాష, బంగారు బుల్లోడు, ఛాలెంజ్, భలేదొంగ, ఖైదీ నెం.786 వంటి సూపర్ హిట్లు సత్యమూర్తి ఖాతాలో ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు చిత్ర సీమలో హాట్ రైటర్ గా ఉన్న సత్యమూర్తి, ఆయన తనయుడు దేవిశ్రీప్రసాద్ ఎంట్రీతో విశ్రాంతి తీసుకుంటున్నారు. దేవిశ్రీ ఎదుగుదలను తన కళ్ళారా చూసుకుని మురిసిపోతున్న సమయంలో ఇలా హటాత్మరణం చెందడం కుటుంబ వర్గీయులను కలిచి వేస్తోంది. ఈ ఏడాది జరిగిన “సన్నాఫ్ సత్యమూర్తి” ఆడియో వేదికపై సత్యమూర్తి తనయుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఆయన తండ్రి సృష్టించిన సందడి తెలిసిన విషయమే.

మొదటి కొడుకు సంగీతంతో ఊపేస్తుండగా, సత్యమూర్తి రెండవ అబ్బాయి సాగర్ సింగర్ గా ఎదుగుతున్నాడు. బుల్లితెరపై ఇప్పటికే పలు షోలు చేసిన సాగర్ కు ఇటీవల అవార్డులు కూడా వచ్చాయి. ఇలా కుటుంబమంతా కళాకారులతో నిండి ఉన్న తరుణంలో… ఆ సంతోషాలకు దూరంగా సత్యమూర్తి వెళ్ళిపోయారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారని సమాచారం.

ఎన్నో సినిమాలకు తన ‘కలం’తో ప్రాణం పోసిన సత్యమూర్తి ‘ఆత్మ’కు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుందాం..!