Music-Director-DSP-Devi-Sri-Prasadసంగీత దర్శకులు తమ స్వంత గాత్రంలో పాటలు వినిపించాలనుకోవడంలో తప్పు లేదు. అది సహజం. కానీ అది పరిమితులు మించి వెళ్ళినప్పుడు ఎంత అభిమానులైనా సరే వద్దు బాబోయ్ అనేస్తారు. ఇసైజ్ఞానిగా కోట్లాది ఫ్యాన్స్ ఉన్న మాస్ట్రో ఇళయరాజా స్వయంగా పాడిన పాటలు తమిళంలో చెప్పుకోదగ్గ నెంబర్ లో ఉన్నాయి కానీ తెలుగులో మాత్రం కలయా నిజమా లాంటి ఒకటి రెండు తప్ప మ్యూజిక్ లవర్స్ కి అంతగా గుర్తు రావు. స్వరబ్రహ్మ మణిశర్మ ఎన్నో గొప్ప బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చినా తన గొంతు హీరోలకు సూట్ కాదని తెలిసే ఏనాడూ దాని జోలికి వెళ్లలేదు. ఎంఎం కీరవాణి, కోటి లాంటి ఉద్దండులు ట్యూన్ డిమాండ్ చేస్తే తప్ప పాడేవారు కాదు.

లవ్ ఆల్బమ్స్ తో సెన్సేషన్ గా నిలిచిన ఆర్పి పట్నాయక్ ఒక స్టేజి దాకా అయన వాయిసే ఎక్కువగా వినిపించడంతో జనానికి రొటీన్ అనిపించడం మొదలైన సందర్భాలున్నాయి. చక్రి ఇదే సమస్యను ఎదురుకున్నారు. ఈ ఉదాహరణలన్నీ ఇప్పుడెందుకంటే దేవిశ్రీ ప్రసాద్ కు సైతం ఈ ప్రాబ్లమ్ తప్పలేదు. బాస్ పార్టీ లిరికల్ వీడియో రాకముందు అంత ట్రోలింగ్ జరగడానికి కారణం కేవలం దేవి పాడిన రెండు మూడు లైన్లే. ఫుల్ వెర్షన్ చూశాక కానీ ఫ్యాన్స్ శాంతించలేదు. నిన్న చిరంజీవి సరదాగా లీక్ చేసిన నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి పాట తాలూకు చిన్న బిట్ దేవి హమ్మింగ్ లోనే రావడం విని మొత్తం దేవినే పాడాడేమోనని అభిమానులు భయపడ్డారు

వాస్తవానికి ఆ ట్రాక్ కి సింగర్ అద్నాన్ సామీ. అప్పుడెప్పుడో తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి ఈయనకి. తర్వాత తగ్గించేశారు కానీ వాల్తేరు వీరయ్యతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇది ముందు చెప్పలేదు. బాస్ కూడా సర్ప్రైజ్ అంటూ ఆ వీడియో వదిలారు కానీ అందులో దేవిశ్రీ ప్రసాద్ గొంతు ఇంత నెగిటివిటీ తీసుకొస్తుందని ఊహించి ఉండరు. ఒకప్పుడు ఇదే దేవి గాత్రం కొన్ని పాటలకు అద్భుతంగా సెట్ అయ్యేది. నితిన్ సైలో కీరవాణి అదే పనిగా పంతం నీదా నాదా సై పాడించారు. వందేమాతరం శ్రీనివాస్ కు పాడిన సందర్భం ఉంది. తన సెల్ఫ్ కంపోజింగ్ లో ఎన్నో ఛార్ట్ బస్టర్స్ దేవి తన ఓన్ వాయిస్ లోనే ఇచ్చాడు

ఒకప్పటి ఫామ్ దేవిశ్రీ ప్రసాద్ లో లేడన్నది వాస్తవం. అందుకే ఏదైనా పాట వస్తోందంటే అంచనాల కంటే అనుమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. కేవలం సుకుమార్ లాంటి వాళ్లకు మాత్రమే తన బెస్ట్ ఇస్తున్నాడన్న విమర్శలు గత నాలుగైదేళ్లలో ఎక్కువయ్యాయి. సరిలేరు నీకెవ్వరుకి అప్పుడు పోటీగా ఉన్న అల వైకుంఠపురములోకి ధీటుగా ఇవ్వలేకపోయాడనే కంప్లయింట్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటికీ చేస్తుంటారు. కాకపోతే వాల్తేర్ వీరయ్య బాస్ పార్ట్ ఊపైతే తీసుకొచ్చింది కానీ మిగిలిన పాటలు కూడా అదే స్థాయిలో ఉంటే మంచిదే. ఏది ఏమైనా ఒకప్పుడు భీకరమైన ఫామ్ అనుభవించిన దేవికి ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రమే.