Municipal Workers Strikeఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. వారు తమకు జీతాలు పెంచాలని సమ్మె చేయడం లేదు. తమ జీతాలలో కోత విధించడాన్ని నిరసిస్తూ సమ్మె చేస్తున్నారు!

ప్రభుత్వం వారికి నెలకు రూ.12,000 జీతం చెల్లించేది. హెల్త్ అలవెన్స్ పేరుతో మరో రూ.6,000 కలిపి నెలకు మొత్తం రూ.18,000 చెల్లించేది. అందరిపై అడగకుండానే వరాలు కురిపించే జగనన్న వారికీ ఓ వరం ప్రకటించారు. 2022, జనవరి నుంచి పారిశుద్య కార్మికులందరికీ నెలకు రూ.3,000 చొప్పున జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు.

అప్పుడు వారు జగన్మోహన్ రెడ్డి చిత్రపఠానికి పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు కూడా. కానీ ఆ తరువాత చేతికి అందిన జీతాలు చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే పెంచిన జీతంతో కలిపి మొత్తం రూ.21,000 రావలసి ఉండగా రూ.15,000 మాత్రమే చేతికి అందింది. ఎటువంటి ప్రకటన చేయకుండా వారి హెల్త్ అలవెన్స్ రూ.6,000ను ఇవ్వడం నిలిపివేసింది.

దాంతో పారిశుధ్య కార్మికులు లబోదిబోమని మొట్టుకొంటూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇంక్రిమెంట్ వస్తే జీతం పెరగాలి కానీ తగ్గిపోవడం ఏమిటని వారు అధికారులను నిలదీశారు. రూ.3,000 జీతం పెంచి రూ.6,000 కోసేసుకోవడం ఏం న్యాయమని నిలదీశారు. కానీ వారి ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం ఉండదు. కనుక సమ్మెకు దిగాల్సి వచ్చింది.

వర్షాకాలం మొదలవడంతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. డెంగూ, మలేరియా జ్వరాల ప్రమాదం పొంచి ఉంది. వీటికి తోడు మళ్ళీ కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటువంటి సమయంలో పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్ల పక్కన చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.

దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కార్మికుల మేలు కోరే ముఖ్యమంత్రి మన జగనన్న. కార్మికుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని వారి హెల్త్ అలవెన్స్ రూ.6,000 యదాతదంగా కొనసాగించేందుకు అంగీకరించారు. దాంతో కలిపి రూ.21,000 చెల్లించేందుకు అంగీకరించారు. కనుక పారిశుధ్య కార్మికులు అందరూ తక్షణం సమ్మె విరమించి విధులలో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.