Municipal Elections TDP Vs YSR Congressగత ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ, గుడివాడలో మాత్రం కొడాలి నానిని ఓడించలేకపోయింది. నాని ప్రభావం ఎంతదాకా ఉందంటే, గుడివాడ పక్కనే ఉన్న పామర్రులో కూడా వైసీపీనే జయకేతనం ఎగురవేసింది. అయితే ఇది మూడేళ్ళ క్రితం నాటి విషయం. మరి వర్తమానంలో గుడివాడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే వైసీపీకి షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయని తాజాగా వెలువడిన మున్సిపల్ ఉప ఎన్నిక ఫలితాలు చెప్తోంది.

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కంచుకోట అయిన గుడివాడ మున్సిపాలిటీ 19వ వార్డుకు ఉప ఎన్నిక జరుగగా, తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, ఇక్కడ గెలుపొంది వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీల పోటీతత్వంతో ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. అయితే తాజాగా వెలువడిన ఫలితం ప్రకారం… వైకాపా అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి నండూరి వెంకటప్రసాద్ 150 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు విజయోత్సాహంలో మునిగిపోగా, వైసీపీ వర్గీయులు నిరాశలో మునిగిపోయారు.

దీంతో స్థానికంగా గుడివాడ‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు టీడీపీ విజ‌యోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా, ఆ ర్యాలీ ఓ థియేట‌ర్ వ‌ద్ద‌కు రాగానే వైసీపీ కార్య‌క‌ర్త‌లు అక్క‌డ‌ త‌మ నాయ‌కుల‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. అంతిమంగా పోలీసులు ఇరు పార్టీల‌ కార్య‌క‌ర్త‌ల‌ను చెద‌ర‌గొట్టి, ప‌రిస్థితిని అదుపు చేసారు.

మరో వైపు రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మున్సిపాలిటీ ఉప ఎన్నికలో అధికార టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి రాజీనామాతో ఈ మున్సిపాలిటీలోని 31వ వార్డుకు ఉప ఎన్నిక జరిగింది. వ్యక్తిగత కారణాలతో టీడీపీ అభ్యర్థి మురళీకృష్ణ రాజీనామా చేయగా, ఈ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి దర్నాసి రాజారావుపై వైసీపీ అభ్యర్థి మేరుగమల్లి వెంకటరమణ 153 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజధాని ప్రాంతంలో ప్రతిపక్ష అభ్యర్థి గెలుపొందడంతో టీడీపీ నేతలు షాక్ కు గురయ్యారు.

ఇక మొత్తంగా చూసుకుంటే… ఆంధ్రప్రదేశ్ లోని వివిధ మున్సిపాలిటీల్లోని ఉప ఎన్నికల్లో మెజారిటీ వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. హిందూపురం 9వ వార్డులో 939 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి బోయ శాంతి విజయం సాధించగా, చిత్తూరు 38వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి వసంత కుమార్ వైకాపా అభ్యర్థిపై 1,508 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎలమంచిలి మున్సిపాలిటీ 31వ వార్డు, మాచర్ల 15వ వార్డులో టీడీపీ గెలవగా, 16వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలో మూడు వార్డులకు ఉప ఎన్నిక జరగ్గా అన్నింటిలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది.