Mumbai-ipl-2017ఐపీఎల్ సీజన్ 10లో భాగంగా ముంబై ఇండియన్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడి, ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఆరంభంలో అదరగొట్టినా, ఇన్నింగ్స్ ముగింపు దశలో ఆశించిన మేర పరుగులు చేయడంలో విఫలమైన హైదరాబాద్ జట్టును ముంబై ఇండియన్స్ అవలీలగా ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లోనూ ఎంపైర్ల తప్పిదాలు బయటపడ్డాయి.

ముంబై ఇండియన్స్ ఆడిన గత మ్యాచ్ (కోల్ కతా నైట్ రైడర్స్)లోనూ ఎంపైర్లుగా వ్యవహరించిన సీకే నందన్, నితిన్ మీనన్ లు రెండు నాటౌట్లను అవుట్ లుగా ప్రకటించి, ముంబై ఇండియన్స్ జట్టును తీవ్ర నిరాశలోకి నెట్టిన విషయం తెలిసిందే. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆక్రోశాన్ని మైదానంలోనే వ్యక్తపరచగా, ఆ తర్వాత అందుకు గానూ రోహిత్ శర్మ మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అయితే హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లోనూ వీరిద్దరే ఎంపైర్లుగా వ్యవహరించారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆరో ఓవర్ లో బూమ్రా వేసిన చివరి బంతిని ఎదుర్కొన్న కెప్టెన్ డేవిడ్ వార్నర్, నాలుగు పరుగులు రాబట్టి, మళ్ళీ అవతలి ఎండ్ లోకి వచ్చి, మెక్ క్లెంగన్ వేసిన ఏడో ఓవర్ మొదటి బంతిని ఎదుర్కొన్నాడు. ఫీల్డ్ లో ఉన్న సీకే నందన్, నితిన్ మీనన్ ఎంపైర్లతో పాటు, టీవీ ఎంపైర్ బార్డే సైతం దీనిని గమనించకపోవడం విశేషం.

ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అంటేనే కుళ్ళుతనంతో నిండుకుని ఉన్న ఆటగాళ్ళుగా పేరుంది. డేవిడ్ వార్నర్ ద్వారా మరోసారి ఇది నిరూపితమైనట్లుగా కనపడుతోంది. ఈ విషయంలో ఎంపైర్లను ఎంతగా నిందించాలో, సదరు ఆటగాడ్ని కూడా అంతకంటే ఎక్కువగా బాధ్యుడ్ని చేయాలి. ఎందుకంటే ఆటలో ఇలా చేస్తారని ఎవరూ అంచనా వేయరు. ఆ టైంలో వార్నర్ షాట్లు మీద షాట్లు కొడుతూ మంచి ఫాంలో ఉండడంతో, వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే ఆలోచనతో ఇలా చేసి ఉండవచ్చు గానీ, అది నిజాయితీకి మచ్చ తెస్తుందని ఆలోచన చేయలేదేమో!