Mumbai Indians v Sunrisers Hyderabad ఇప్పటికే ముంబై ఇండియన్స్, పూణే జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా, మరో రెండు స్థానాల కోసం కోల్ కతా, హైదరాబాద్, పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. అయితే ఇది ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ కు ముందు వరకు ఉన్న పరిస్థితి! శనివారం రాత్రి ఈ ముగిసిన తర్వాత బరిలో నుండి ఢిల్లీ డేర్ డెవిల్స్ ను తప్పించడంలో ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించి, మిగిలిన జట్లకు సానుకూల వాతావరణం కల్పించింది.

14 పాయింట్లతో ఉన్న కోల్ కతా జట్టు చేతిలో మూడు మ్యాచ్ లు ఉండగా, అందులో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అలాగే 10 పాయింట్లతో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో 4 మ్యాచ్ లు ఉండగా, అందులో మూడు గెలిస్తే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి వేరు. 13 పాయింట్లతో ఉన్న హైదరాబాద్ జట్టు చేతిలో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఉండగా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు చేరాలంటే రెండు మ్యాచ్ లు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

దీంతో మిగిలిన జట్లతో పోలిస్తే హైదరాబాద్ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. బరిలో ఢిల్లీ ఉంటే అది మరింత దారుణంగా ఉండేది. ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం పాలవ్వడం హైదరాబాద్ కు బాగా కలిసోచ్చిందనే చెప్పాలి. అంతకు ముందు మ్యాచ్ లో 209 పరుగులను చేధించిన డేర్ డెవిల్స్, ముంబై బౌలర్ల ప్రతాపానికి 66 పరుగులకే ఆలౌట్ అవుతారని మాత్రం ఎవరూ ఊహించలేదు. 146 పరుగుల దారుణ పరాజయంతో నెట్ రన్ రేట్ పరంగా కూడా ఢిల్లీ అధమ స్థితికి చేరుకుంది.

ఫైనల్ గా చెప్పాలంటే… ముంబై, పూణే జట్లు ఇప్పటికే తమ స్థానాలను భర్తీ చేసుకోగా, మిగిలిన రెండు స్థానాల కోసం కోల్ కతా, హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. నేడు జరగనున్న బెంగుళూరు వర్సెస్ కోల్ కతా మ్యాచ్ లో నైట్ రైడర్స్ విజయం సాధిస్తే… కోల్ కతా కూడా క్వాలిఫై అయినట్లే భావించవచ్చు. అప్పుడు ఒక స్థానం కోసం పంజాబ్, హైదరాబాద్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది.