Mumbai Indians beat Kings XI Punjabఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో దారుణమైన వైఫల్యాలను చవిచూస్తోన్న ముంబై ఇండియన్స్ జట్టు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ప్రతి మ్యాచ్ నాకౌట్ మాదిరి ఆడాల్సిన ముంబై ఇండియన్స్ జట్టు ఒక మ్యాచ్ ను విజయవంతంగా గట్టెక్కారు. శుక్రవారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో 175 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి, 19 ఓవర్లలోనే చేధించింది.

ఈ లక్ష్య చేధనలో సూర్యకుమార్ యాదవ్ 57, ఇషాన్ కిషన్ 25, హార్దిక్ పాండ్య 23, రోహిత్ శర్మ 24, కృనాల్ పాండ్య 31 పరుగులతో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా చివరి 4 ఓవర్లలో విజయానికి 50 పరుగులు చేయాల్సి ఉండగా, 3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేయడంలో కృనాల్ పాండ్య ప్రధాన పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటింగ్ విభాగంలో గేల్ 50, స్టోనిసిస్ 29 పరుగులతో రాణించారు.

ఈ విజయంతో అట్టడుగున ఉన్న ముంబై జట్టు ఏకంగా 5వ స్థానానికి ఎగబాకింది. చేతిలో ఇంకా అయిదు మ్యాచ్ లు ఉండగా, టాప్ 4లోకి ఎంటర్ కావాలంటే క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా ఈ 5 మ్యాచ్ లలోనూ డిఫెండింగ్ ఛాంపియన్ విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి నాలుగు స్థానాలలో హైదరాబాద్, చెన్నై, కోల్ కతా, పంజాబ్ జట్లు నిలిచాయి.