mumbai boy record in world cricket history‘జెంటిల్మెన్’ గేమ్ గా కీర్తింపబడే క్రికెట్ లో మరో చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 సెంచరీలను ఒకే ఇన్నింగ్స్ లో బాదేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ప్రణవ్ ధనవాడే ప్రతిభ. ఆటోడ్రైవర్ కుమారుడిగా అండర్ 16లో ఆడుతున్న ఈ ముంబై యువకుడు సోమవారం పాత చరిత్రను తిరగరాయగా, మంగళవారం నాడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.

తానూ ఎదుర్కొన్న 323 బంతుల్లో 129 బంతులను బౌండరీ దాటించగా, 59 బంతులను సిక్సర్లుగా మలిచి ఏకంగా 1009 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తను సాధించిన 1009 పరుగులలో 870 పరుగులను (188 బంతుల్లో) బౌండరీ, సిక్సర్లల రూపంలో రాబట్టగా, మిగిలిన 135 బంతుల్లో 139 పరుగులు చేసాడు.

ప్రణవ్ కొట్టిన కొట్టుడుకు తన జట్టు ఏకంగా 1,465 పరుగులు చేసింది. ఇక రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ప్రత్యర్థి జట్టు కేవలం 83 పరుగులే చేయడంతో 1,382 పరుగుల తేడాతో ప్రణవ్ జట్టు అత్యంత భారీ విజయం సొంతం చేసుకుంది. ప్రణవ్ చేసిన విన్యాసాన్ని తెలుసుకున్న ‘క్రికెట్ దేవుడు’ సచిన్ సైతం ప్రశంసలతో ముంచెత్తాడు. ఒక్క సచినే కాదు, ట్విట్టర్ నిండా సెలబ్రిటీలంతా ప్రణవ్ ఇన్నింగ్స్ కు దాసోహమన్నారు. అయితే తన ఈ ఆటతీరుకు సచినే మార్గదర్శకమంటూ ప్రణవ్ చెప్పడంతో నేటి యువతపై సచిన్ ప్రభావం ఏ మేరకు ఉందో అర్థమవుతుంది.

క్రికెట్ మొదలైన నాటి నుండి ఒక ఇన్నింగ్స్ లో 1000కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ ఘనతను సాధించి భారత కీర్తి ప్రతిష్టతను ప్రపంచానికి చాటిచెప్పిన ప్రణవ్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం.