Mudragada Padmanabhamకాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాడె వదిలేశారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో తనపై కొందరు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశవాది, గజదొంగ, కులద్రోహి, అంటూ నానా రకాలుగా కొందరు తిట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తనపై దుష్ప్రచారం చేస్తున్న నేతలే బీసీ రిజర్వేషన్ సాధించాలని ఆయన లేఖలో కోరారు. చాలా కాలంగా నిజాయితీగా రిజర్వేషన్ కోసం ఉద్యమం చేస్తుంటే, సపోర్ట్ చేయకపోగా విమర్శించడం సరికాదని అయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ సమయంలో కూడా ముద్రగడకు మద్దతు రాకపోవడం గమనార్హం.

అసలు ముద్రగడ అలిసిపోవడానికో లేక విసిగిపోవడానికో ఇప్పటివరకు చేసినది ఏముంది? జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు మూడు లేఖలు రాశారు… అది కూడా చంద్రబాబుని దూషించడానికే సరిపోయాయి. అసలైతే చంద్రబాబు అధికారంలో ఉండగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తగలబెట్టిన తరువాత నిరాహార దీక్ష టైంలోనే ముద్రగడ కాడే వదిలేశారు.

ఆ తరువాత రెండు సంవత్సరాలు అప్పుడప్పుడూ లేఖలతో చంద్రబాబుని గద్దె దించడానికి మాత్రమే సమయమంతా వెచ్చించారు. కాపు ఉద్యమానికి ఏం చేశారు అంటే ఆయనే చెప్పుకోలేని పరిస్థితి. అటువంటి సమయంలో ఎవరో ఏదో అన్నారని బాధ పడితే ఎలా? ఇంకో నాలుగేళ్లు రెస్టు తీసుకుని చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్ళీ వస్తారేమో!