mudragadda about jaganకాపులకు ప్రత్యేక రిజ‌ర్వేష‌న్ల పోరాటంలో ముద్రగడ ప‌ద్మనాభం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో నిర్వహించిన సభలో ఆందోళ‌న‌కారులు రెచ్చిపోయి రైలుని, ప్రభుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సుదీర్ఘ విచార‌ణ జ‌రిపిన సీఐడీ ఈ రోజు తుని కేసు రిమాండ్ రిపోర్టును మీడియా ముందుంచింది. తుని కుట్రకు పూర్తి బాధ్యత ముద్రగడదే అని సీఐడీ పేర్కొంది.

కాపులు నిర్వ‌హించిన స‌భ‌లో కార్యకర్తలు రెచ్చిపోవ‌డంతో ర‌త్నాచ‌ల్ రైలు, ప్ర‌భుత్వ ఆస్తుల ధ్వంసం జ‌రిగిందని, ఈ విధ్వంసానికి కార్య‌క‌ర్త‌ల్ని ముద్ర‌గ‌డే ప్రేరేపించారని నివేదిక‌లో సీఐడీ స్పష్టంగా పేర్కొంది. ముద్రగడ వ్యాఖ్యలతోనే ఆందోళ‌న కారులు రెచ్చిపోయారని తెలిపింది. అలాగే మరికొంద‌రు ఆందోళ‌న కారులు కుట్ర పూరితంగా స‌భ‌కు వ‌చ్చారని త‌మ‌తో ఆయుధాలు, పెట్రోల్, డీజిల్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే తెచ్చుకున్నారని సీఐడీ పేర్కొంది. దీంతో ఏ క్షణంలోనైనా ముద్రగడ పద్మనాభంను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు ఊపందుకున్నాయి.

అయితే దీనికి ముందే డిప్యూటీ సిఎం ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రిమాండ్ లో ఉన్న నిందితులపై కేసులు కొట్టేయడం ఎలా సాధ్యమో ముద్రగడే తెలపాలని.., కోర్టులంటే ముద్రగడకు గౌరవం లేకుండా పోయిందని.., సాధ్యం కాని డిమాండ్లు కోరుతున్నందున ముద్రగడ డిమాండ్లకు అంగీకరించే పరిస్థితే లేదని… ముద్రగడ ప్రమేయం ఉందని తేలితే, ఆయనపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు వెనుకాడబోమని కూడా చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలతో ముద్రగడ అరెస్ట్ ఖాయంగా కనపడుతోందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.