Mudhragada Padmanabham threatens with pesticideకాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి చేతిలో “పురుగు మందు” డబ్బా ప్రత్యక్షమవడంతో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో హైటెన్షన్ నెలకొంది. తుని విధ్వంస కారులంటూ అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయాలని, కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ తీరని నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ముద్రగడ కిర్లంపూడిలోని తన సొంతింటిలో ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

అయితే ముద్రగడ దీక్షను భగ్నం చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు వచ్చారు. కాపు నేతల అడ్డగింపుతో ముద్రగడపై కేసు నమోదు చేశామంటూ ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకుని తన ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దీక్షను భగ్నం చేయాలని చూస్తే పురుగుల మందు తాగుతానని హెచ్చరించిన ఆయన తన చేతిలోని పురుగుల మందు డబ్బాను పోలీసులకు చూపారు.

దీంతో కాపులంతా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసులను అడ్డుకునేందుకు శతధా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో కిర్లంపూడిలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముద్రగడ, “నన్ను అరెస్ట్ చేయడానికి మీరెవరు? నాపై కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులను రమ్మనండి. అయినా అమలాపురంలో నమోదైన కేసులో నేను అరెస్టయ్యే సమస్యే లేదు. తుని ఘటనకు సంబంధించి కేసు నమోదు చేస్తే చెప్పండి. ఆ కేసులో అయితేనే నేను అరెస్టవుతా. ముందు మీరు ఇక్కడి నుంచి వెనక్కెళ్లండి. అవసరమనుకుంటే సీఐడీ పోలీసులను రమ్మనండి” అంటూ కేకలేయడంతో పోలీసులు షాక్ తిన్నారు.