Mudragada Padmanabhamకాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారగానే ఏదో వంకతో ఉద్యయం కాడె వదిలేశారు. తనను చాలా మంది విమర్శిస్తున్నారు కాబట్టి ఇక తప్పుకుంటున్నా అని ప్రకటించారు. ఆయనే తమ నాయకుడిగా ఉండాలంటూ పద్మనాభంతో కాపు జేఏసీ నేతలు కీలక సమావేశమయ్యారు.

ఈరోజు మధ్యాహ్నం 13 జిల్లాల నుంచి కిర్లంపూడికి వచ్చిన కాపు జేఏసీ నేతలను ముద్రగడ సాదరంగా ఆహ్వానించారు. సుమారు అరగంటకు పైగా కాపు ఉద్యమంపై సమాలోచనలు చేపట్టారు. అయితే ఈ సమావేశంలో వారికి నో చెప్పారు ముద్రగడ. తాను ఇక పై ఉద్యమానికి నాయకత్వం వహించలేను అని మరోసారి ముద్రగడ స్పష్టం చేశారు.

ఈ మేరకు ఓ ప్రకటనను కూడా ఆయన విడుదల చేశారు. “తిరిగి కాపు ఉద్యమం నడపాలన్న మీ కోరికను అంగీకరించలేకపోతున్నా. వ్యక్తిగతంగా మీతోనే ఉంటాను. మనం మంచి స్నేహితులం. మీ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా తెలియజేస్తే నా ఓపిక ఉన్నంత వరకూ వస్తాను. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంత వరకు ఆహ్వానిస్తాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు” అని ముద్రగడ ప్రకటనలో కోరారు.

ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి… అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ల విషయం తన పరిధిలో లేని అంశమని… తాను ఏమీ చెయ్యలేను అని తేల్చి చెప్పారు. అయినా కాపులు వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎన్నికలలో బ్రహ్మరథం పట్టడంతో ఈ అంశంపై ఆ సామాజిక వర్గానికే ఇంట్రెస్టు లేదు అనే సంకేతం వెళ్లడంతో ఇంక పల్చబడిపోయింది.