Mudragada Padmanabham open letter to ys jaganచంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన 5% కాపు రేజర్వేషన్లు జగన్ ప్రభుత్వం రద్దు చెయ్యడంతో ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి లేఖాస్త్రం సంధించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం ఈబీసీ కోటాల రిజర్వేషన్‌లో 5 శాతం తమ జాతికి అమలు చేయడానికి కోర్టులో కేసులు ఉన్నందున ఇవ్వడానికి కుదరదని మీరు చెప్పినట్లు.. దీనిపై జీవో కూడా ఇచ్చారని పత్రికల్లో చూశానని ముద్రగడ చెప్పుకొచ్చారు. “నిజంగా కోర్టు స్టే ఉంటే తిరిగి ఎన్నికలు వచ్చేవరకు మా డిమాండ్లు, హక్కులు అడగకుండా నోటికి ప్లాస్టర్‌ వేసుకుంటా,” అన్నారు ముద్రగడ.

“కాపు జాతి ఎటువంటి కోరికలు లేకుండా బానిసలుగా బతకాలా?. కేవలం మీరిస్తానన్న రూ.2వేల కోట్లకు ఆశపడి…కాపులు మీకు ఓటేశారని భావిస్తున్నారా?. నిత్యం ఈ జాతి ఓట్లు వేయాలి ఎటువంటి కోరికలు లేకుండా బానిసలుగానే బతకాలనే మీ అభిప్రాయమేంటి..?. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చి తీరుతానన్నారు. కానీ పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం లాంటిదని చెప్పడం జరిగింది. మడమతిప్పని మీరు కనీసం హోదా గురించి పట్టించుకోకుండా బానిసలు బతుకుతున్న మా జాతి ఆశలపై నీళ్లు చల్లడం మీకు తగునా ముఖ్యమంత్రి గారూ..?” అని వైఎస్ జగన్‌ ను ఎద్దేవా చేశారు.

సోషల్ మీడియాలో తన మీద వస్తున్న ఆరోపణల మీద కూడా ముద్రగడ స్పందించారు. “తమరి సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో బూతులు ప్రచారం అయిన సందర్భంగా వారు బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రోజు నన్ను కాపు ద్రోహి, స్వార్థపరుడు, గజదొంగ, అమ్ముడుపోయాడు, మునిగిపోయిన ముద్రగడ అని ఎన్నో బూతులు అన్ని పార్టీల వారు రాయిస్తున్నారు. దయచేసి నేను కూడా మీ సోదరి షర్మిల లాంటివాడినే అని గ్రహించమని కోరుతున్నాను” అని ముద్రగడ చెప్పుకొచ్చారు.