Tuni incident-Cases filed on Mudragada Padmanabham Botsa satyanarayana and Ambati rambabuతునిలో జరిగిన “కాపు గర్జన” సభతో మళ్ళీ రాజకీయ తెరపై మెరిసిన ఒకప్పటి తెలుగుదేశం నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతటి అలజడిని సృష్టించారో అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత కాపుల అభ్యున్నతి కోసం అంటూ నాలుగు రోజుల పాటు సతీసమేతంగా దీక్ష చేసి ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చిందని విరమించారు. అయితే ప్రభుత్వం నుండి వచ్చిన ఆ స్పష్టమైన హామీలేంటో సగటు కాపు ప్రజలకు మాత్రం అర్ధం కాలేదని కాపు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.

ఇది జరిగి దాదాపుగా ఒక మాసం పూర్తయ్యింది. అప్పటినుండి సైలెంట్ గా ఉన్న ముద్రగడ తాజాగా మరోసారి మీడియాకెక్కారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని, హామీలను నిలబెట్టుకోకపోతే మళ్ళీ మేమంతా రోడ్ల మీదకు వస్తామని మీడియా వేదికగా ప్రభుత్వానికి హెచ్చరికలను జారీ చేస్తున్నారు ముద్రగడ. అయితే మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన బడ్జెట్ కేటాయింపుల షాక్ తో తల పట్టుకుని ఉంటే, సమయం, సందర్భం లేకుండా కేవలం రాజకీయ లబ్ది కోసం ముద్రగడ మళ్ళీ ‘కుల రాజకీయాలను’ తెరపైకి తీసుకువస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు.

ముద్రగడ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా పరిశీలనలోకి తీసుకుంటుందో లేదో గాని, ఏదైనా ఒక సున్నితమైన సమస్యకు పరిష్కారం ప్రభుత్వ వర్గాల నుండి ఆశించినప్పుడు ఉద్యమ నేతలకు ఎంతో నిజాయితీ, నిబద్దత, సహనం అవసరమన్నది చరిత్ర చెపుతున్న పాఠం. కానీ, ఇందుకు విరుద్ధంగా ముద్రగడ చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఉన్నాయని, ఒక రకంగా జగన్ ఏజెంట్ మాదిరి ముద్రగడ వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్న ఓ టాక్.