India -T20 World Cup 2016టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అనేక అపూర్వ విజయాలను అందించిన ఘనత మహేంద్ర సింగ్ ధోని సొంతం. ‘కాలం కలిసి వస్తే…’ ఓడిపోయే మ్యాచ్ లను కూడా గెలవవచ్చు అన్న దానికి ప్రతీకగా కెప్టెన్ గా ధోని రికార్డులు ఉన్నాయి. దీంతో ఒకానొక సమయంలో ధోని ఆటతీరు కంటే ‘అదృష్టం’ ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యింది. అలా విజయాలను అందించిన ధోనికి ప్రస్తుతం కాలం కలిసి వస్తున్నట్లు లేదు.

2011లో ప్రపంచ కప్ గెలిచిన నాటి నుండి కెప్టెన్ గా ధోని సిరీస్ విజయాల శాతం దారుణంగా తగ్గిపోతూ వస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా అయితే ధోని కెప్టెన్ గా కప్ లు తెచ్చిపెట్టింది చాలా తక్కువ. దీంతో ధోని కెప్టెన్ గానే కాక, ఆటగాడిగా కూడా రిటైర్మెంట్ ప్రకటించాలన్న డిమాండ్ భారీగా వినపడింది. దీనికి మాటల ద్వారా బదులు చెప్పిన ధోని, సిరీస్ లను మాత్రం నెగ్గడంలో వరుసగా విఫలమవుతున్నాడు.

ముఖ్యంగా అవలీలగా గెలవాల్సిన మ్యాచ్ లలో సైతం ధోని నేతృత్వంలో జట్టు పరాజయాల పాలవ్వడంతో ధోని శకం ముగిసినట్లే భావించవచ్చన్న వాదనలు మళ్ళీ తెర పైకి వచ్చాయి. తాజాగా కివీస్ తో జరిగిన మ్యాచ్ లో చేజేతులా ఓటమి పాలయ్యారనే ఆవేదనతో మరోసారి ధోని ‘అదృష్టం’ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ధోనిని ‘దురదృష్టం’ వెన్నాడుతోందని, గత రెండేళ్లుగా ధోని సారధ్యంలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవని భారత జట్టు, ఇటీవల కోహ్లి కెప్టెన్ గా విజయపతకాన్ని ఎగురవేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ… ఈ టీ 20 ప్రపంచ కప్ ధోని ‘అదృష్టానికి’ ఆఖరి పరీక్షగా క్రీడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.