MS Dhoni Impress on virat kohli bullet throwరాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాను టీమిండియా మట్టి కరిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్ పై వరుసగా 7వ టీ20 విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ కేవలం 118 పరుగులే చేయగా, వరుణుడు ఆటంకంతో భారత్ లక్ష్యాన్ని 6 ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 1 వికెట్ కోల్పోయి టీమిండియా అవలీలగా చేధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్ టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో క్రమం తప్పకుండా వికెట్లు నేలకూలుతూ వచ్చాయి. టీమిండియా పడగొట్టిన 8 వికెట్లల్లో అయిదుగురు బ్యాట్స్ మెన్లు బౌల్డ్ కావడం విశేషం. అలాగే ఒక మెరుపు త్రో విసిరి కెప్టెన్ విరాట్ కోహ్లి క్రిష్టియన్ ను రనౌట్ రూపంలో పెవిలియన్ కు పంపించాడు. ఈయన ఔటైన మూడు బంతులకే వర్షం వలన ఆసీస్ ఇన్నింగ్స్ 18.4 బంతులలో 118/8 వద్ద ముగిసింది. అయితే కోహ్లి చేసిన రనౌట్ కు మహేంద్ర సింగ్ ధోని అబ్బూరపడిపోయిన హావభావాలను ప్రదర్శించాడు.

క్రిష్టియన్ మిడాన్ కు బంతిని కొట్టి రెండో పరుగు కోసం యత్నించగా, మెరుగు వేగంతో కదిలిన కోహ్లి అంతే స్పీడ్ గా బంతిని వికెట్ల వైపున ఉన్న మహేంద్ర సింగ్ ధోని వైపుకు విసిరాడు. అయితే అది ఒక బంప్ పడి నేరుగా వికెట్లను తాకడంతో, కోహ్లి బుల్లెట్ త్రో పట్ల మహేంద్రుడు హర్షం వ్యక్తం చేస్తూ… ఆశ్చర్యకరమైన హావభావాలను ఇచ్చాడు. ముందుగా ధోనియే ఈ రనౌట్ చేసారని కామెంటేటర్స్ భావించగా, రిప్లైలో కోహ్లి త్రోను, ధోని ఎక్స్ ప్రెషన్స్ ను చూసి నాలుక కరుచుకున్నారు.