MS-Dhoni-breaks-Sourav-Ganguly-records!
విండీస్ వేదికగా జరుగుతున్న అయిదు వన్డేల సిరీస్ లో 2-0తో లీడింగ్ లో ఉన్న టీమిండియాకు జలక్ ఇచ్చింది వెస్టీండీస్. ఆంటిగ్వా వేదికగా జరిగిన నాలుగవ వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 189 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా ఖాతాలో మరో ఈజీ విక్టరీ ఖాయం, దాంతో పాటు సిరీస్ విజయం కూడా దక్కనుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ఈ స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికిలపడింది.

190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మూడవ ఓవర్లో ధావన్ (5) వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి (3), దినేష్ కార్తీక్ (2) వికెట్లను కూడా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో ఓపెనర్ రెహానే కు జత కట్టిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రెహానే, 60 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అప్పటికీ టీమిండియా విజయం సాధించడానికి 19 ఓవర్లలో 90 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 6 వికెట్లు ఉన్నాయి.

ఓ పక్కన క్రీజులో ధోని ఉండగా, మరో పక్కన జాదవ్ (10), పాండ్య (20), జడేజా (11), ఉమేష్ యాదవ్ (0), మొహమ్మద్ షమీ (1) ఇలా వచ్చి అలా పెవిలియన్ కు చేరుకున్నారు. దీంతో 49.4 ఓవర్లలో 178 పరుగులు చేసి టీమిండియా ఆలౌట్ అయ్యింది. 8వ వికెట్ గా ధోని (54 పరుగులు చేసిన తర్వాత) 49వ ఓవర్ చివరికి బంతి అవుట్ కావడంతో, టీమిండియా పరాజయం ఖరారైంది. ఈ క్రమంలో అంతకు ముందు సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న ఓ చెత్త రికార్డును మహేంద్ర సింగ్ ధోని తన వశం చేసుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 114 బంతులను ఎదుర్కొన్న ధోని ఒకే ఒక్క బౌండరీ సాధించి 54 పరుగులు చేసాడు. అయితే అర్ధసెంచరీని పూర్తి చేయడానికి 108 బంతులను తీసుకుని సరికొత్త రికార్డుకు వేదిక అయ్యాడు. 2000వ సంవత్సరం తర్వాత ఒక ఇంటర్నేషనల్ వన్డేలో అతి ఎక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించిన ఘనత గంగూలీ (105 బంతుల్లో) ఉండగా, దానిని ధోని అధిగమించాడు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 5 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.