MP_YS_Avinash_Reddy_Arrestవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాననిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రేపు శుక్రవారం హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉంది. రేపు విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అనివార్యమని గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే ఇవాళ్ళ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. ఈ కేసులో సీబీఐ తనకి సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించిందని. రేపు మరోసారి ప్రశ్నించిన తర్వాత తనని అరెస్ట్ చేయవద్దని సీబీఐ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి పిటిషన్‌ ద్వారా హైకోర్టుని అభ్యర్ధించారు. అలాగే సీబీఐ అధికారులు కెమెరా ఎదుట తనను ప్రశ్నించవలసిందిగా ఆదేశించాలని అవినాష్ రెడ్డి హైకోర్టుని అభ్యర్ధించారు.

ఈ కేసులో మరో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న కడప జైలులో విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది.

ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందామూ లేదని ఎంపీ అవినాష్ రెడ్డి వాదిస్తున్నప్పటికీ, ఆయనే వివేకాను అడ్డుతొలగించుకోవడానికి మిగిలిన నిందితులతో కలిసి ఈ కుట్రను అమలుచేశారని సీబీఐ స్పష్టంగా చెపుతోంది. దానికి అవసరమైన అన్ని బలమైన సాక్ష్యాధారాలను కూడా కోర్టుకి సమర్పించింది. కనుక అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం అనివార్యంగానే కనిపిస్తోంది. ఈ విషయం ఆయన కూడా గ్రహించిన్నట్లే ఉన్నారు కనుకనే చివరి ప్రయత్నంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసిన్నట్లు భావించవచ్చు. కానీ దీంతో ఆయనే స్వయంగా సీబీఐకి తనను అరెస్ట్ చేయవచ్చనే సూచన ఇచ్చిన్నట్లయ్యింది. ఒకవేళ ఆయన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరిస్తే అప్పుడు సీబీఐ తప్పకుండా అరెస్ట్ చేయవచ్చు.