MP Vijaya Sai Reddy కేంద్రం మెడలు వంచుతాం… ప్రత్యేక హోదా తెస్తాం అంటూ ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ డిమాండ్ పక్కన పెట్టింది. కేంద్రం మెడలు వంచుతాం అని బీరాలు పలికి ఇప్పుడు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మారిపోవడం విశేషం.

తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయేకు ఆ పార్టీ మద్దతు పలికింది. మీడియాతో మాట్లాడిన వైసీపీ రాజ్యసభ ఎంపీ సాయి రెడ్డి.. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌కే మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ పోటీ చేస్తుండగా… ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ ఝా బరిలోకి దిగుతున్నారు.

ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకుగాను… 244 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీయేకు మెజారిటీ ఉన్నా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బలం సరిపోదు. దానితో డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేడీ, వైసీసీ, టీఆర్ఎస్ పార్టీల మద్దతు కీలకంగా మారింది.

వైఎస్సార్ కాంగ్రెస్ డైరెక్టుగా మద్దతు ఇచ్చింది. అదే విధంగా ఈ మధ్య కాలంలో కేంద్రం మీద విమర్శలు చేస్తున్న తెరాస ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండి పరోక్ష మద్దతు ఇస్తుంది. మొత్తానికి బీజేపీ ఎటువంటి పొత్తులు లేకుండానే రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా ఇబ్బందులు లేకుండా తన పని జరిపించుకుంటుంది.