sujana-chowdaryమొన్నటివరకు ‘ప్రత్యేక హోదా’ సాధించి తీరుతాం… ఖచ్చితంగా కేంద్రం నుండి సానుకూల ప్రకటన వస్తుంది… అని చెప్పిన కేంద్రమంత్రివర్యులు సుజనా చౌదరి గారిపై స్థానికంగా అనేక మంది అనేక ఆరోపణలు గుప్పించారు. బహుశా ‘స్పెషల్ స్టేటస్’ను కేంద్రం నుండి రప్పించినట్లయితే, ఆ ఆరోపణలకు ప్రాధాన్యత దక్కేది కాదు. కానీ, ప్రస్తుతం సీన్ రివర్స్ అయిన నేపధ్యంలో… తన కేంద్రమంత్రి పదవి కోసం, తన పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.

ఇదిలా ఉంటే, తాజాగా సుజనా గారు కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ పై వీర ప్రేమను కురిపిస్తూ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండడం వలన, సొంత సర్కార్ ను సమర్ధించుకోవడంలో అర్ధం ఉంది గానీ, ప్రజలను తప్పుద్రోవ పట్టించేలా… అసలు ‘స్పెషల్ స్టేటస్’ అనేది పనికి రాని అంశంగా వ్యాఖ్యానించడంలో కేంద్రంపై తనకు ఎంత ప్రేమ దాగి ఉందో చెప్పకనే చెప్తున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ ముందు ‘ప్రత్యేక హోదా’ వృధా అని… ఇంకా చెప్పాలంటే.., ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, హోదా వలన కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువని… చెప్పుకొచ్చారు సుజనా చౌదరి.

ఒక్కసారి సుజనా వ్యాఖ్యలను పక్కనపెట్టి… పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటే… నిజంగా సుజనా చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే, ఇన్నాళ్ళు ప్రత్యేక హోదా కావాలని ఎందుకు ప్రజలను మభ్యపెట్టారు? అప్పుడే హోదా కంటే స్పెషల్ ప్యాకేజ్ తీసుకుంటే మెరుగవుతుంది అన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉండవచ్చు కదా..? అని పవన్ సంధించిన ప్రశ్నలు గుర్తుకు రాక మానవు. అవకాశవాద రాజకీయాలకు చరమగీతం పాడాలని… సంకల్పించుకున్న పవన్ నిర్ణయం సరైనదేనని భావించాలి. సహజంగా సొంత ప్రభుత్వంపై మమకారం ప్రదర్శించడం మామూలే గానీ, ఈ ‘సుజనా గారి వీరప్రేమగాధ’ మాత్రం భరించలేని విధంగా ఉండడం విమర్శించదగ్గ విషయమే.