Kesineni Nani Chandrababuవిజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని మళ్ళీ నేడు మరోసారి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో కేశినేని భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం నేను టిడిపిలోనే ఉన్నాను కానీ కేవలం పార్టీ సభ్యుడిగా మాత్రమే. పార్టీలో నాకు ఎటువంటి పదవులు లేవు. బహుశః అందుకేనేమో విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రాభోత్సవానికి, రాజమహేంద్రవరంలో మహానాడుకి కూడా నన్ను ఆహ్వానించలేదనుకొంటా!

అక్కడ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి తప్ప మరెవరికీ పనిలేదనిపించింది. పార్టీలో నాకు గౌరవం లభించకపోయినా విజయవాడ ప్రజలలో నాకు గౌరవం ఉంది. కనుక పార్టీ టికెట్‌ ఇవ్వకపోయినా నేను ప్రజాబలంతో విజయం సాధించగలను. నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ పేరుతో హంగామా చేస్తున్న గొట్టంగాళ్ళు పార్టీలో చాలా మందే ఉన్నారు. వాళ్ళని నేను పట్టించుకోను. నియోజకవర్గంలో నా పని నేను చేసుకుపోతుంటాను. నేను ఎటువంటివాడినో, ఏమేమి పనులు చేయించానో అందరికీ తెలుసు.

చంద్రబాబు నాయుడు, సిఎం జగన్మోహన్ రెడ్డిలను అభిమానించేవారూ ఉంటారు. విమర్శించేవారు ఉంటారు. అదేవిదంగా నన్ను కూడా అభిమానించేవారూ, విమర్శించేవారు చాలా మందే విజయవాడలో ఉన్నారు. అలాగని నన్ను విమర్శించేవారిని శత్రువులుగా భావించి వారితో గొడవపడను. నేటికీ ఈ కేశినేని భవన్‌ మీద ఫ్లెక్సీ బ్యానర్‌లో నన్ను రోజూ తిడుతున్నా ఆ గొట్టంగాళ్ల ఫోటోలు కూడా ఉంటాయి.

చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్‌ షాని ఎందుకు కలిశారనేది నాకు అనవసరం. పార్టీలో తగిన గౌరవం ఉంటే ఉంటాను లేకుంటే నేను ఏమి చేయాలో నాకుబాగా తెలుసు,” అన్నారు.

కేశినేని నాని సోదరుల మద్య విభేధాలలో చంద్రబాబు నాయుడు ఆయన సోదరుడు కేశినేని చిన్నా వైపు మొగ్గుచూపడమే ఈ అసంతృప్తికి కారణం. అయితే కేశినేని నాని ఇంత బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయనతో చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి.

కేశినేని నానికి విజయవాడలో టిడిపి నేతలెవరితోనూ పొసగడం లేదు. అందుకే అందరూ ఆయనను వ్యతిరేకిస్తుంటారు. పార్టీలో ఒక్కరి కోసం ఎక్కువ మందికి అసంతృప్తి కలిగించుకోవడం తెలివైన పని అనిపించుకోదు కనుకనే చంద్రబాబు నాయుడు కేశినేని నానిని బుజ్జగించే ప్రయత్నం చేయడం లేదని భావించవచ్చు.

ఈ విషయం కేశినేని నానికి కూడా బాగా తెలుసు. కనుక అందరితో సర్దుకుపోయి పార్టీలో కొనసాగడమా లేదా పార్టీపై అసంతృప్తితో వేరే పార్టీలో చేరడమా అనేది ఆయనే ఆలోచించుకోవలసి ఉంటుంది. బహుశః బయటకు వెళ్ళేందుకు సిద్దపడే పార్టీకి నష్టం కలిగించేట్లు ఈవిధంగా మాట్లాడుతున్నట్లున్నారు.