MP Kavitha confident on KCR leadershipతెలంగాణాలో ఎటు చూసినా ముఖ్యమంత్రి కేసీఆర్ నామధేయమే వినపడుతోంది. ఈ ప్రభావం రాజకీయ నాయకులను తాకి, పార్టీలను ఫిరాయిస్తూ కేసీఆర్ చెంతకు చేరేలా చేస్తోంది. అయితే ఈ వలసలతో టీఆర్ఎస్ పార్టీ నాయకులతో నిండిపోతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు గనుక, పెద్దగా ఇబ్బంది లేకపోయినా, చివరికి సీట్ల పంపిణీ దగ్గరికి వస్తే కుమ్ములాటకు ఖాయం అన్న మాటలు రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్నాయి.

‘కారులో ఎక్కువ మంది ఎక్కితే ఇరుకై పోతుందేమో, నిబంధలనకు విరుద్ధంగా ఎక్కువ మంది ఉంటే ఆర్టీఓ కేసు రాస్తారేమో…’ అంటూ ఓ న్యూస్ యాంకర్ నిజామాబాద్ ఎంపీ కవితను అడిగితే… “మా కారులో విశాలమైన చోటు ఉంది, కేసీఆర్ డ్రైవింగ్ పైన నమ్మకముంది, స్మూత్ గా నడిపిస్తారు, రాజకీయంగా పార్టీని బలం చేసుకోవడం టీఆర్ఎస్ కు ముఖ్యం, అందుకనే నాయకులకు డోర్లు తెరిచి ఉంచామంటూ” పార్టీ ఫిరాయింపును సమర్ధించుకున్నారు.

తెలంగాణాలో ప్రతిపక్షం లేకుండా చేయాలని మేము భావించడం లేదని, అయితే నాయకులే టీఆర్ఎస్ పై నమ్మకంతో వస్తున్నారని, తెలంగాణాలో ఉన్న జాతీయ పార్టీలకు దేశమంతా కావాలని, వారి దృష్టిలో తెలంగాణా స్థానం 29 అయ్యి ఉండవచ్చు, కానీ టీఆర్ఎస్ కు తెలంగాణానే నెంబర్ 1 అని తమ ఉద్దేశాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేసారు కవిత.