MP Kanumuru Raghu-Rama Krishnam Rajuనేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఈ రోజు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనకు చాలా దగ్గరగా వ్యవహరించిన ప్రస్తుత ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఒక ఆసక్తికరమైన విషయం మీడియాకు చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల వైఎస్ కు ఎంతో గౌరవం ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఓ సారి పేపర్‌లో చంద్రబాబుపై ఓ కార్టూన్ వస్తే.. దాన్ని వైఎస్‌కు చూపించానని, అది చూడగానే ఆయన సీరియస్ అయిపోయారని అన్నారు. పేపర్‌ను గట్టిగా విసిరి కొట్టారని చెప్పారు. “ఇదేం బాలేదు. చంద్రబాబు 9ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇది సరికాదు. ఆయనపట్ల గౌరవం ఉండాలి’’ అని అన్నారట.

ఆయనను చూసిన తర్వాత ఈ రోజుల్లో కూడా ఇలాంటి మహానుభావులు ఉన్నారా అనుకుంటూ ఆయన సంస్కారానికి నమస్కారం పెట్టానని రఘురామ వ్యాఖ్యానించారు. ఆయన ఏ స్కీమ్ పెట్టినా రాజీవ్, నెహ్రూల పేర్లే పెట్టారని చెప్పుకొచ్చారు. ఇతరులను గౌరవిస్తూ.. వ్యక్తిగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు.

గతంలో ఒక సందర్భంలో చంద్రబాబు కూడా తాను వైఎస్ సన్నిహితంగా ఉండే వారమని, రాజకీయంగా విరోధులమైనా ఇద్దరం గౌరవించుకునే వారమని చెప్పుకొచ్చారు. అయితే దానికి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆయనను ఎద్దేవా చెయ్యడం కూడా మన అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా రాజకీయాలలో ఉండే వారు వారి మధ్య వైరం రాజకీయాల వరకే పరిమితం చేస్తే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది.