MP Goratla Madhav warning to Kia Motors Officialsకియా తొలి కారు విడుదల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందని నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన సంస్థ ప్రతినిధి తీవ్రంగా మందలిస్తున్న ఫోటో కూడా మీడియాలో ప్రచురితం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే… కొత్తగా విడుదలయిన కారుపై సంతకాలు చేసే కార్యక్రమంలో ఆయన తన నిరసన వ్యాఖ్యలను రాసి సంతకం పెట్టారు.

‘‘ఇవాళ కారు లాంచింగ్‌ ప్రోగ్రామ్‌లో కారుపై ఏదో రాసి సంతకం పెట్టమని చెబితే, నాకు కడుపు మండి, ‘కియ కార్‌ రోల్‌ అవుట్‌.. బట్‌ అవర్‌ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ ఈజ్‌ రూల్డ్‌ అవుట్‌’ అనే మాటను రాసి సంతకం పెట్టడం జరిగింది. ఇంకా వారు చంద్రబాబు మత్తులోనే ఉన్నట్టు ఉన్నారు. మా ముఖ్యమంత్రి వేరే ఆలోచనతో ఉన్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది’’ అని తెలిపారు. ‘‘ఎక్కడినుంచో తీసుకొచ్చినవారికి మంచి ఉద్యోగాలు ఇచ్చారు. స్థానికులకు వాచ్‌మెన్లు, బాత్రూమ్‌ క్లీనింగ్‌, గడ్డి పీకే పనుల్లాంటివి ఇచ్చారు. అందుకే కారుపై అలా రాశాను’’ అని తెలిపారు

అయితే కార్యక్రమంలో ముందుగా మాధవ్ ను స్టేజి మీదకు పిలవనందున ఆయన ఆగ్రహం తో ఊగిపోయారని, ఆ తరువాత కియా మోటార్స్ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా ముఖ్యమంత్రి పేరు లేదని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు ప్రస్తావించకుండా ఇంటర్నేషనల్‌ మీడియాతో కేవలం నిర్వాహకుల పేర్లు మాత్రమే రాయడాన్ని కూడా ఆయన ఆక్షేపించారు. ఒక అంతర్జాతీయ సంస్థకు వారి తొలి కారు విడుదల సందర్భంగా ఒక ఎంపీ ఇలా వ్యవహరించి పెట్టుబడిదారులకు ఏమని మెస్సేజ్ ఇస్తున్నారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.