ఈ సమ్మర్ మోత మోగేలా ఉంది!కరోనా కారణంతో గత రెండు సంవత్సరాలుగా సరైన సమయానికి సినిమాలు రిలీజ్ కాకుండా వాయిదాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే మన టాలీవుడ్ లో మాత్రం ఈ డిసెంబర్ నుండి వచ్చే సమ్మర్ వరకు వరుసగా ప్రతి వారం ఏదొక సినిమా ప్రేక్షకులను పలకరించేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కరోనా ఎలాంటి ట్విస్ట్ లు ఇవ్వకపోతే ఈ సారి సమ్మర్ అయితే మోత మోగిపోయేలా ఉంది.

విద్యార్థుల పరీక్షలు ముగిసే సమయం అయిన ఏప్రిల్ మాసం మొదటి రోజునే ప్రిన్స్ “సర్కార్ వారి పాట” ద్వారా సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. చాలాకాలం తర్వాత మహేష్ మేకోవర్ అభిమానులను ఉత్తేజ పరిచింది. ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read – సినీ పరిశ్రమని ఇప్పటికైనా ఏపీకి రప్పించగలరా?

దేశమంతా గత రెండేళ్లుగా నిరీక్షిస్తోన్న ప్రశాంత్ నీల్ – యష్ ల “కేజీఎఫ్ 2” ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ రాబోతోంది. ఈ సినిమాకున్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. రిలీజ్ చేసిన టీజర్ సృష్టించిన రికార్డులు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎలా ఎదురు చూస్తున్నారో చెప్తోంది. మొదటి పార్ట్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా యష్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టతలు రానున్నాయి.

అలాగే అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” కూడా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కు సిద్ధమైంది. అమీర్ మూవీకి ఇండియా వ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కమల్ హాసన్ “విక్రమ్, పోనియన్ సెల్వన్” సినిమాలు కూడా ఒక నెల రోజుల గ్యాప్ లో సమ్మర్ లోనే రానున్నాయి.

Also Read – హమ్మయ్య! కొడాలి నాని కూడా ఫామ్‌లోకి వచ్చేశారుగా

ఇక విజయ్ – నెల్సన్ ల “బీస్ట్” కూడా ఏప్రిల్ 14వ తేదీనే హంగామా చేయడానికి రెడీ అవుతోంది. అలాగే ఏప్రిల్ నెలాఖరున మెగాస్టార్ చిరంజీవి “గాడ్ ఫాదర్” కూడా సందడి చేయడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఒక్క ఏప్రిల్ నెలలోనే ఇన్ని సినిమాలు సిద్ధమయ్యాయి.