Movies effect - on online classesప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సెకండ్ వేవ్ మాదిరి అత్యంత ప్రమాదకరం కాకున్నా, ఈ మూడో వేవ్ లో చాలా మంది పాజిటివ్ కు గురవుతున్న వైనం తెలిసిందే. సామాన్యులతో పాటు అత్యంత జాగ్రత్తగా ఉండే సినీ సెలబ్రిటీలు మహేష్, చిరంజీవి వంటి వారు కూడా ఈ థర్డ్ వేవ్ లో కరోనా సోకిన వైనం బహిరంగమే.

ఈ కరోనా దెబ్బతో ప్రస్తుతం చదువులు కూడా ఆన్ లైన్ వేదికగానే జరుగుతున్నాయి. ఈ ఆన్ లైన్ విధ్యే ఉపాధ్యాయుల పాలిట శాపంలా మారినట్లుంది. జూమ్, వెబ్ రెక్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి తదితర మాధ్యమాల వేదికగా జరుగుతున్న విద్యలో పాల్గొంటున్న స్టూడెంట్స్, ఉపాధ్యాయులను ముప్పతిప్పలు పెడుతున్నారు.

వీటికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల థియేటర్లలో హల్చల్ చేసినటువంటి “పుష్ప, శ్యామ్ సింగరాయ్” సినిమాలలోని క్యారెక్టర్ పేర్లతో లాగిన్ అవుతూ టీచర్లకు చుక్కలు చూపెడుతున్నారు. కేవలం లాగిన్ పేర్లతో ఆగితే, కధ ఇక్కడి వరకు వచ్చేది కాదు, ఏకంగా ఆ పాత్రలలో జీవిస్తూ టీచర్లకు ముచ్చెటమలు పట్టిస్తున్నారు.

ఒక విద్యార్థి అయితే తాను ‘శ్యామ్ సింగరాయ్’గా మళ్ళీ జన్మించానని, తన రోజీ సింగరాయ్ కూడా ఇక్కడే ఉందని, మా ఇద్దరినీ కలపాల్సిన బాధ్యత మీ మీదే ఉందంటూ లెక్చరర్ ను ముప్పతిప్పలు పెట్టిన వైనం వర్ణించలేనిది. ఇది ఎంతవరకు వెళ్లిందంటే, ఇప్పుడు కాదు, క్లాసులు అయిపోయిన తర్వాత ఆఫ్ ది రికార్డ్ మాట్లాడతా అని లెక్చరర్ సదరు విద్యార్థికి బదులిచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు.

అలాగే ‘పుష్ప’ సినిమాలోని భన్వర్ సింగ్ షెకావత్ పేరుతో మరో విద్యార్థి ‘ఒక్కటి తక్కువయ్యింది మేడమ్’ అంటూ ఉపాధ్యాయురాలిని విసిగించే ప్రయత్నం చేసారు. ఆఖరికి వీడియో ఆన్ చేయమని సదరు లెక్చరర్ సీరియస్ గా అడగడంతో, అసలు పేరును బయట పెట్టాల్సి వచ్చింది. ఈ రెండింటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నెటిజన్లకు హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, ఇది విధ్యను బోధించే ఉపాధ్యాయులను అవమానించినట్లుగా పేర్కొనాలి. కరోనా కారణంతో ప్రత్యక్షంగా కాకపోయినా, కనీసం ఆన్ లైన్ లో అయినా విద్యార్థులకు పాఠాలను చెప్పాలని శ్రమిస్తోన్న టీచర్ల పాలిట శాపంగా పరిగణించవచ్చు. ఇలాంటివి విద్యార్థుల బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తాయి తప్ప, సృజనాత్మకతకు కొలమానం కాదు.