Movie Sequelsఒక దెబ్బకు రెండు పిట్టలు పాత సామెత. ఒక కథకు రెండు సినిమాలు టాలీవుడ్ సౌత్ సినిమా పాడుతున్న సరికొత్త సీక్వెల్ మంత్రం. ఒకప్పుడు ఈ రెండో భాగం కాన్సెప్ట్ అంతగా అచ్చి వచ్చేది కాదు. వర్మ నిర్మాతగా శివనాగేశ్వరరావుతో మనీ తీస్తే సూపర్ హిట్ అయ్యింది. దీంతో హుషారుగా మనీ మనీ తీస్తే పెద్దగా ఎక్కలేదు. ఆ తర్వాత కొంత కాలం ఎవరూ వీటి జోలికి వెళ్ళలేదు. జెడి చక్రవర్తి సత్యని శర్వానంద్ తో సత్య 2గా తీస్తే అడ్డంగా తన్నేసింది. రవితేజ కిక్ 2, నాగార్జున మన్మథుడు 2 ఏమయ్యాయో ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. గాయం 2, సర్దార్ గబ్బర్ సింగ్, మంత్ర 2, వెన్నెల 1.5 ఇలా చెప్పుకుంటూ పోతే డిజాస్టర్ల లిస్టు చాంతాడంత అవుతుంది.

బాహుబలి ఈ లెక్కలన్నీ మార్చేసింది. మొదటి భాగం కన్నా సెకండ్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడం దీంతోనే మొదలయ్యింది. కెజిఎఫ్ 2 దీన్నింకా బలపరిచింది. ఇక పుష్ప 1 నార్త్ లో చేసిన రచ్చకి సుకుమార్ 2 మొదలుపెట్టే ముందు స్క్రిప్ట్ కే ఏడాదికి పైగా సమయం ఖర్చు పెట్టాడు. అంత ఒత్తిడి వచ్చేసింది. ఇప్పుడు ప్రభాస్ సలార్ – ప్రాజెక్ట్ కె, పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు – ఓజిలు ఇదే తరహాలో టూ పార్ట్స్ గా వస్తాయనే ప్రచారం ఊపందుకుంది. వీటికి అధికారిక ధ్రువీకరణ లేకపోయినా ట్విట్టర్ చర్చ మహాజోరుగా ఉంది. సిద్దు జొన్నలగడ్డ లాంటి చిన్న హీరోనే డీజే టిల్లు కొనసాగింపుని క్యాష్ చేసుకుంటున్నప్పుడు పెద్ద స్టార్లు మాత్రం ఎందుకు వదలుతారనే డౌట్ కాబోలు.

ఇదంతా వినడానికి బాగానే ఉంది కానీ రాబోయే రోజుల్లో ఇలా ఒకే సినిమాని సీరియల్ లాగా భాగాలుగా చూపిస్తామంటే అసలుకే మోసం రావొచ్చు. వెబ్ సిరీస్ ల మోడల్ వీటికి పనికిరాదు. ఒకసారి వంద కోట్లు పెట్టుబడి పెట్టి నూటా యాభై కోట్లు సంపాదించే బదులు దాని స్థానంలో రెండు తీస్తే డబుల్ ప్రాఫిట్స్ వస్తాయి కదానే లెక్కలు తప్పేమీ కాదు. కానీ కేవలం బిజినెస్ కోణంలో ఆలోచించి లేని అంశాలను బలవంతంగా స్క్రిప్ట్ లో జొప్పించి తీస్తే మాత్రం అందులో కృత్రిమత్వం బయటపడి ఆడియన్స్ తిప్పి కొట్టే ప్రమాదం ఉంది. హీరోలు సైతం ప్రాక్టికల్ గా అలోచింది కొత్త కథలు చేసేదాన్ని ప్రోత్సహించాలి కానీ ఇలా నెంబర్ టూ ట్రాప్ లో పడకూడదు.

ఇది మనం కొత్తగా నేర్చుకున్నది కాదు. హాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈవిల్ డెడ్, మమ్మీ, జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, కింగ్ కాంగ్, యాంటీ మ్యాన్, అవతార్, గాడ్జిలా, ఎగ్జార్సిస్ట్, జుమాంజి వగైరాలు దశాబ్దాల తరబడి నెంబర్లు మార్చుకుంటూ ఇంచుమించు అవే కథలతో వస్తున్నా ఆదరణ దక్కించుకుంటున్నాయి. దానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. మనకలా ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఏదోనాడు మొహం మొత్తేస్తుంది. సరే ఇప్పుడంటే ఏదో ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఓకే కానీ ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం వచ్చిన 7జి బృందావన్ కాలనీ లాంటివి ఇప్పుడు తీయాలనుకోవడమే సరైన ఆలోచన కాదు. ఒకవేళ షోలే, అడవిరాముడులు ఇప్పుడైతే సీక్వెల్స్ వచ్చేవేమో.