Motkupalli Narasimhulu Joining JanaSenaచంద్రబాబుతో విభేదించి పార్టీ నుండి సస్పెండైన మోత్కుపల్లి నరసింహులు తెరాసలో చేరదామని అనుకున్నా అటువైపు నుండి ఎలాంటి స్పందన రాలేదు. అప్పట్లో వైకాపా నుండి విజయసాయి రెడ్డి వెళ్ళి ఆయనను కలిసినా రాజకీయంగా ఎటువంటి కదలికా రాలేదు, అయితే తాజాగా ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతుంది.

నేడో రేపో హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నట్టు సమాచారం. చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూవచ్చిన మోత్కుపల్లి… తాజాగా తిరుమల టూర్‌లోనూ ఏపీ సీఎంపై మాటల దాడి చేశారు. అయితే తన తిరుపతి టూరు నుండి జనసేనలోకి మోత్కుపల్లి టచ్‌లోకి వచ్చారని అంటున్నారు.

1983లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు… ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ, స్వతంత్ర, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారాయన. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో మోత్కుపల్లి ఎన్టీఆర్ వైపు నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన… 2001 తర్వాత కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరారు. అప్పటి నుండి ఆయన టీడీపీలోనే కొనసాగారు.