Motkupalli Narasimhuluచంద్రబాబుతో విభేదించి పార్టీ నుండి సస్పెండైన మోత్కుపల్లి నరసింహులు తెరాసలో చేరదామని అనుకున్నా అటువైపు నుండి ఎలాంటి స్పందన రాలేదు. అప్పట్లో వైకాపా నుండి విజయసాయి రెడ్డి వెళ్ళి ఆయనను కలిసినా రాజకీయంగా ఎటువంటి కదలికా రాలేదు. అప్పట్లో జనసేనలో చేరతారని వార్తలు వచ్చినా అటువంటిది ఏమీ జరగలేదు. 2018 ఎన్నికలలో ఆలేరు నుండి బహుజన్ లెఫ్ట్ పార్టీ నుండి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.

రాజకీయంగా నష్టపోయినా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఓడిపోయారు అనే ఆనందం మాత్రం మిగిలింది. ఇప్పుడు ఆయన తన రాజకీయ ప్రస్థానం మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. శనివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. మోత్కుపల్లి ఇంటికి వెళ్లి బీజేపీలోకి ఆహ్వానించారు. తెలంగాణ టీడీపీకి చెందిన కీలక నేతలు 18వ తేదీన బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో చేరనున్నారు. ఇందుకోసం బీజేపీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నారు. అయితే మోత్కుపల్లి ఆరోజు కాకుండా వారం తర్వాత అంటే ఆగస్టు 25న కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

1983లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు… ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ, స్వతంత్ర, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారాయన. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో మోత్కుపల్లి ఎన్టీఆర్ వైపు నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన… 2001 తర్వాత కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరారు. అప్పటి నుండి ఆయన టీడీపీలోనే కొనసాగారు