more-expectations-on-prabhas-saahoఒక సినిమా కోసం ‘యంగ్ రెబల్ స్టార్’ ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తారో రాజమౌళి చెప్పకనే చెప్పారు. రెండు సినిమాల మధ్యలో కొంత సమయం ఉంది గనుక, ఓ సినిమా చేయమని చెప్పినా వినకుండా, ‘బాహుబలి 2’ కోసమే ప్రభాస్ కష్టపడ్డాడని జక్కన్న ఇచ్చిన కితాబును అభిమానులు ఎప్పటికీ మరవకపోవచ్చు. అంతలా ప్రభాస్ కష్టపడ్డాడు కాబట్టే, ఊహించని విజయం సొంతమైందని, అదే కష్టాన్ని కొనసాగిస్తూ మరింత ఎదగాలని ప్రభాస్ ఆలోచనలు చేస్తున్నాడట.

ముఖ్యంగా ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ పై ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అంచనాలను అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అందులోనూ “సాహో” కూడా తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల కాబోతోంది. దీంతో ప్రభాస్ పై ఖచ్చితంగా జాతీయ మీడియా కన్ను ఉంటుంది. ‘సాహో’తో ప్రేక్షకులను సంతృప్తి పరిస్తే… రాజమౌళి ఇమేజ్ నుండి ప్రభాస్ బయటకు వచ్చి, సొంత ఇమేజ్ ను ఏర్పరచుకున్న వారవుతారు.

అందుకే ‘సాహో’ కోసం తన సర్వస్వం పెట్టేయాలన్న కృతనిశ్చయంతో ప్రభాస్ ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలలో బలమైన ప్రచారం జరుగుతోంది. ఎంతలా అంటే… ‘సాహో’ సినిమాతో తన పేరు మాత్రమే వినిపించేలా… హిందీలో సైతం తన సొంత స్వరంతో డబ్బింగ్ చెప్పి ప్రేక్షకులను పడేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమాకు డబ్బింగ్ తో మేనేజ్ చేసిన ప్రభాస్, ‘సాహో’కు మాత్రం సొంత గొంతును వినిపించాలని, అందుకని హిందీ భాషను కూడా నేర్చుకుంటున్నారని సమాచారం. మరి ప్రభాస్ కష్టానికి తగిన ఫలితం ఎలా ఉంటుందో 2018లో తెలియనుంది.