నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై ప్రజలలో ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాజధానిపై అనవసరంగా అపోహలు సృష్టించవద్దని కోరారు మంత్రి మోపిదేవి వెంకటరమణ… గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని నిర్మాణం పేరుతో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను దొడ్డిదారిన చంద్రబాబు పేరుతో బినామీ అకౌంట్లుకు మళ్లించారని ఆరోపించారు. ఇక, రాజధాని నాసిరకంగా నిర్మాణాలు చేశారని విమర్శించారు మోపిదేవి.
మరోవైపు రాష్ట్ర ప్రజానీకం జగన్ పై నమ్మకం పెట్టుకున్నారు.. పాదయాత్రలో హామీలన్నీ జగన్ నేరవేర్చుతారని స్పష్టం చేశారు మోపిదేవి… అవినీతిని ప్రక్షాళన చేస్తూ ప్రభుత్వం నడిపించటం వైఎస్ జగన్‌కే సాధ్యమన్నారు ఆయన. రెండు రోజుల క్రితం మరో మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా రాజధానిపై అనుమానాలు వద్దని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్య్వవహారం నోటితో పొగిడి నొసటితో ఎక్కిరించినట్టుగా ఉంది. ఒకపక్క రాజధానిపై స్పందించకుండా ముఖ్యమంత్రే ఇటువంటి ఊహాగానాలకు తావు ఇస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రాజధాని ఊసు లేని సంగతి తెలిసిందే. ఇటీవలే గవర్నర్ ప్రసంగంలో కూడా ఆ ప్రస్తావన తీసుకుని రాలేదు. సీఆర్డీఏ పై సమీక్షా సమావేశం జరిపి రాజధానిపై నిర్ణయం తీసుకుంటాం అని లీకులు ఇచ్చిన ప్రభుత్వం ఈ నెల ఐదున జరపాల్సిన ఆ మీటింగును వాయిదా వేస్తూ వస్తుంది. ఒకవైపు మంత్రులతో ఒక రకంగా మాట్లాడిస్తూ… ముఖ్యమంత్రి వేరేగా ఇండికేషన్ ఇస్తూ రాజధాని మీద ప్రజలలో అయోమయాన్ని సృష్టిస్తున్నారు.