Nandyal-By-Election-2017తెలుగుదేశం పార్టీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ సీపీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ జరిగినట్టు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో. ఈ ఎన్నికల బందోబస్తులో భాగంగా పోలీసులు జరిపిన తనిఖీల్లో దాదాపు ఒక కోటిన్నర రూపాయలు మాత్రమే పట్టుబడగా, తనిఖీల్లో దొరకకుండా సుమారు 60 కోట్ల రూపాయలు ప్రజలకు అందినట్టు మీడియా వర్గాలు ప్రత్యేక కధనాలు ప్రసారం చేస్తున్నాయి.

ఓ పార్టీ ఓటుకు 2 వేలు పంచగా, మరో పార్టీ 1000 ఇచ్చినట్టు స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ గ్రామంలో తొలుత ఓ ప్రధాన పార్టీ 1000 చొప్పున పంచగా, అదే రోజు సాయంత్రం మరో పార్టీ వచ్చి ఓటుకు 2 వేల చొప్పున పంపకాలు ప్రారంభించగా, తొలుత వెయ్యి రూపాయలు ఇచ్చిన పార్టీ వచ్చి మరో వెయ్యి చొప్పున ఇచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. రెండు పార్టీలూ వేసిన ఎత్తుకు పైఎత్తులు ఎలా ఉన్నా, చివరకు పంపకాల్లో ఒక పార్టీ ముందడుగు వేసినట్టు ప్రచారం జరుగుతూ ఉంది.

అభివృద్ధి పేరిట తొలుత ప్రచారం జరిగినప్పటికీ, చివరకు వచ్చేసరికి రెండు ప్రధాన పార్టీలు డబ్బు మూటలను రంగంలోకి దించాయి. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు 5 వేల వరకూ ధర పలికినట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. అలాగే పలు చోట్ల తమకు డబ్బు అందలేదన్న నిరసనలూ బహిర్గతమయ్యాయంటే, కరెన్సీ ఏరులై పారిందన్న విషయం దాదాపుగా అధికారికమైనట్టే. గ్రామాల వారీగా ప్రధాన పార్టీలు స్వయంగా నియమించుకున్న బయటి వ్యక్తులు మాత్రమే ఈ పంపకాలను పర్యవేక్షించినట్లుగా సమాచారం.

స్థానిక కార్యకర్తలు ఓటర్ల ఇంటిని చూపించడానికి పరిమితం కాగా, ఇంట్లోని ఓట్ల సంఖ్యను బట్టి డబ్బులను బయటి వ్యక్తులే అందించినట్టు సమాచారం. ఇక నంద్యాలలోని కొన్ని వార్డుల్లో స్థానిక నాయకులే డబ్బులను జేబులో వేసుకున్నారని కొంతమంది మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేయగా, అప్పటికప్పుడు డబ్బులు తెచ్చి వారికి పంచినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఖరీదైన అసెంబ్లీ ఎన్నికలుగా నిలిచాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.