Three People in Race for The Coveted TTD Postమంచు వారి మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కోసారి ఒక్కొక్కరి పక్కన నిలబడి వారిని ఆకాశానికి ఎత్తేస్తారు. ప్రతిదానిలోనూ కొంత క్రెడిట్ మాకు కావాల్సిందే అంటారు. తాజాగా అటువంటి ఘటన ఇంకొకటి జరిగింది. వివరాల్లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పోస్టుకు రేసులో మోహన్ బాబు ఉన్నారని వార్తలు వచ్చాయి. కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటు ఆయనకూడా ఆ పదవి ఆశిస్తున్నారని, జగన్ తో ఉన్న బంధుత్వం కారణంగా పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ వార్తల సారాంశం.

దీనిపై మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. “నేను టీటీడీ చైర్మన్‌ రేసుల్లో ఉన్నట్టుగా వార్తలు, ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి. నా ఆశయం వైఎస్‌ జగన్‌ని సీఎంగా చూడటం. అందుకోసం నా వంతుగా కష్టపడ్డాను. నేను తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కారణం వైఎస్‌ జగన్‌ ప్రజల ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకమే గాని ఎలాంటి పదవులు ఆశించి కాదు,” మోహన్ బాబు ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యడం ఏకంగా మోహన్ బాబు ఆశయమా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు.

2012 నుండి జగన్ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం తన ఆశయం గురించి మోహన్ బాబు చెప్పిందీ లేదు, ఏమైనా చేసిందీ లేదు. ఎన్నికలకు కేవలం 2-3 వారల ముందు ఆయన చంద్రబాబు మీద దండయాత్ర చేసి వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ గాలిని పసిగట్టి రాబోయే అధికారపార్టీ పంచన చేరారు అని చాలా మంది అప్పట్లో అన్నారు. అయితే అదేమీ కాదు జగన్ ను ముఖ్యమంత్రిగా చూడటం నా ఆశయం అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. నిజమేనంటారా?