mohan babu re-entry to politicsఒకప్పుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మంచు మోహన్ బాబు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని అధికారిక ప్రకటన చేసారు. “కొత్త పార్టీ పెట్టి గందరగోళం సృష్టించే ఉద్దేశం తనకు లేదని, ప్రస్తుతం ఉన్న ఏదొక పార్టీలోనే చేరతానని మంచు వారు ప్రకటించారు. “తానూ ఆవేశపరుడినే గానీ, అవినీతి పరుడ్ని కాదని, ఒక ఉపాధ్యాయుడికి జన్మించిన తానూ ఉపాధ్యాయ వృత్తిలో పని చేసి, ఆ తర్వాత అంచలంచెలుగా ఇలా ఎదిగానని, నా కన్న తల్లితండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా… రోజు టీవీలలో చూస్తుంటే బాధేస్తోంది… తట్టుకోలేకపోతున్నానని, చేయగలిగే స్థితిలో ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నానని, త్వరలోనే ఏ పార్టీలో చేరబోయే దానిపై ప్రకటన చేస్తానని” అన్నారు.

“తన మాటను ప్రజలు నమ్ముతారు, కుల రాజకీయాలు చేయడానికి నేను రాలేదు, అన్ని కులాల వారు తన వెంట ఉంటారు” అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఆనాటి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలను తలపిస్తున్నాయి. ‘తానూ అందరివాడిని అని, ఏ ఒక్క కులానికో పరిమితం కాదలుచుకోలేదు’ అంటూ చిరు చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత ఎలాంటి రూపు సిద్ధించుకున్నాయో తెలిసిందే. అయితే ఇక్కడ చిరు మాదిరి మోహన్ బాబు సొంత పార్టీ అంశం కాకపోవడం మంచు వారికి కలిసొచ్చే అంశం.

అయితే మంచు మోహన్ బాబు ఏ పార్టీలో చేరతారు అన్న దాని కన్నా, ఏ రాష్ట్ర రాజకీయాల్లో భాగస్వామి అవుతారు అన్నది కీలకంగా మారింది. స్వతహాగా తిరుపతి వాసి అయినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. మరి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలంటే… ఏదొక రోజు విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంలో ప్రతిపక్ష అధినేత జగన్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరి మంచు వారు ఎప్పుడు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారో గానీ, రాజకీయాల్లో మరో సినీ సెలబ్రిటీ సందడి చేయడం పొలిటికల్ వాతావరణాన్ని మరింత హీట్ ఎక్కిస్తోంది.