mohan babu met chandrababu naidu ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యావేత్త, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళారు. సుమారు గంటసేపు వారు మాట్లాడుకొన్నారు. తిరుపతిలోని మంచు కుటుంబం అధ్వర్యంలో నడుస్తున్న శ్రీవిద్యానికేతన్ కళాశాలలో సాయిబాబా గుడిలో విగ్రహ ప్రతిష్టాపనకు చంద్రబాబు నాయుడుని ఆహ్వానించడానికే వచ్చారని, వారి మద్య ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదని టిడిపి వర్గాలు తెలిపాయి.

అయితే గతంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ రోడ్లపై ధర్నాలు చేసిన మోహన్ బాబు, 2019 ఎన్నికలలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసి టిడిపిని ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డికి ఉడతాభక్తిగా తనవంతు సాయం చేశారు. అటువంటి వ్యక్తి విగ్రహ ప్రతిష్టాపనకు చంద్రబాబు నాయుడుని ఆహ్వానించడానికి వచ్చారంటే నమ్మశక్యంగా లేదు.

మోహన్ బాబుకి దేశభక్తి కాస్త ఎక్కువేనని అందరికీ తెలుసు. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతుండటం, రాజధాని, పోలవరం నిర్మాణాలు దాదాపు నిలిచిపోవడం వంటివి ఆయనకు బాధ కలిగించి ఉండవచ్చు. జగన్ ప్రభుత్వం సినీ, విద్యారంగాలలో చలగాటం ఆడుతుండటం మోహన్ బాబు వంటివారు భరించడం కష్టమే. కనుక ఆయన మళ్ళీ టిడిపిలో చేరాలని భావిస్తే అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాబోదు. అయితే తమకు మద్దతు పలికిన మోహన్ బాబు తమ రాజకీయ శత్రువైన చంద్రబాబు నాయుడుని కలిసినందుకు జగనన్న ఆగ్రహానికి గురవుతారేమో?కనుక మంచు కరిగిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత మోహన్ బాబునే ఉంది.