Politics Are Becoming Dirty Day By Day: Mohan Babuమోహన్ బాబు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇదేమి సెన్సేషనల్ న్యూస్ కాదు, రాజకీయంగా అయితే ఏ మాత్రం ప్రాధాన్యత లేని ఓ వార్తే. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలక పాత్రేమీ మోహన్ బాబు పోషించడం లేదు. వైసీపీకి అవసరమైనపుడు మాత్రం మీడియా ముఖంగా కాస్త హడావుడి చేసే మోహన్ బాబు రాజకీయ సన్యాసం చేయడంలో వింతేమీ లేదు.

ఎందుకంటే మోహన్ బాబు మాదిరే గతంలో ముద్రగడ పద్మనాభం కూడా ఇదే తీరున వ్యవహరించిన వైనం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ అంటూ ముద్రగడ తెగ హంగామా చేయగా, 5% శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు పార్లమెంట్ కు పంపించిన విషయం తెలిసిందే.

అయితే జగన్ ముఖ్యమంత్రిగా రాగానే ఆ 5% రిజర్వేషన్ కల్పించలేమని వెనక్కి తీసుకోగా, ముద్రగడ రాజకీయ సన్యాసం అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. జగన్ కార్యాచరణలో భాగంగా గత ప్రభుత్వంలో పోరాటం చేసి పరోక్షంగా వైసీపీ అధికారంలోకి రావడానికి సహకరించిన ముద్రగడ, జగన్ ముఖ్యమంత్రి కాగానే ఉద్యమాన్ని ఉన్నట్లుండి విరమించుకున్నారు.

అలాగే మోహన్ బాబుది కూడా సేమ్ టు సేమ్. చంద్రబాబు ప్రభుత్వంలో తన కాలేజీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేసిన మోహన్ బాబు, ప్రస్తుతం కూడా పరిస్థితి అలాగే ఉందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే అప్పుడు ప్రభుత్వం నుండి తనకు సమాధానం కూడా లభించలేదు, ఇప్పుడు ఆ సమాధానం వస్తోంది, అదే తేడా చెప్పారు.

గత ప్రభుత్వంపై చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వంపై ఎందుకు దండయాత్ర చేయడం లేదు? అంటే జగన్ మోహన్ రెడ్డితో ఉన్న కుటుంబ మరియు వ్యక్తిగత సాన్నిహిత్యం అన్న జవాబే వస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్న మోహన్ బాబు ప్రచారంలో పాలు పంచుకున్నారు తప్ప, క్రియాశీలక రాజకీయాలలో ఏనాడూ భాగస్వామ్యులు కాలేదు.

అయితే చంద్రబాబు మాదిరి జగన్ పైన పోరాటం చేసే యోచన లేకపోవడమే రాజకీయ సన్యాస ప్రకటనకు అసలు కారణంగా తెలుస్తోంది. ముక్కుసూటిగా మాట్లాడతారనే టాక్ ను సొంతం చేసుకున్న మోహన్ బాబు, ఒకవేళ జగన్ ప్రభుత్వంపై స్పందించాల్సి వస్తే ఖచ్చితంగా విమర్శలు చేయాల్సి వస్తుంది, రాజకీయాలకు పూర్తిగా దూరమైతే ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారం ఉండదు గనుక, ఈ రాజకీయ సన్యాస ప్రకటన వచ్చి ఉండొచ్చనేది పొలిటికల్ వర్గాల టాక్.