Mohan Babu, Mohan Babu Compliments KCR, Mohan Babu Compliments CM KCR, Actor Mohan Babu Compliments KCR, Manchu Mohan Babu Compliments KCR, Mohan Babu Compliments Telangana CM KCRఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన వారిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థానం ఎప్పుడూ ప్రధమమే అని అందరూ అంగీకరించే సత్యం. సినీ వర్గాలలో గానీ, పొలిటికల్ వర్గాలు గానీ, అటు ప్రజానీకంలో గానీ ఈ అంశంపై మరో ఆలోచనకు తావు లేదు, ఇంకో మాటకు ఆస్కారం లేదు. అయితే, ఎన్టీఆర్ తర్వాత అంత అద్భుతంగా పాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్న మాత్రం ఎప్పుడూ రాజకీయాల్లో సమాధానం లేని ప్రశ్నగానే మిగులుతోంది.

నిజానికి ఒకప్పుడు ఈ ప్రశ్నకు మరో ఆప్షన్ లేకుండా ‘చంద్రబాబు నాయుడు’ అన్న సమాధానం ఒకానొక సమయంలో వెలువడేది. హైదరాబాద్ ను తీర్చిదిద్దిన విధానం, ప్రపంచ పటంలో తెలుగోడి సత్తాను చూపించిన తీరు విమర్శకులను కూడా ముగ్ధులను చేసింది. అయితే ఒక్కసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత పరిస్థితి తారుమారయ్యింది. అప్పటివరకు చంద్రబాబుకు సహకరించని రైతుల అండతో వైఎస్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. అలాగే ‘ప్రజలను సోమరిపోతులను చేసే సంక్షేమ పధకాలంటూ’ చంద్రబాబు పక్కనపెట్టిన వాటిని మళ్ళీ ప్రవేశపెట్టి, ప్రజల మన్నన పొందడంలో వైఎస్ ఘనవిజయం సాధించారు.

దీంతో ఎన్టీఆర్ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న నానుడి పొలిటికల్ వర్గాల్లో బలంగా వ్యక్తమయ్యింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… 80వ దశకాల్లో ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పధకాలనే, 30 ఏళ్ళ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసి మార్కులు కొట్టేసారు. ఒక నాయకుడిగా చంద్రబాబు కంటే వైఎస్ ఎక్కువ మార్కులు పొందుతారేమో గానీ, ఒక ముఖ్యమంత్రిగా మాత్రం వైఎస్ కంటే చంద్రబాబు ఎప్పుడూ రెండు అడుగులు పైనే ఉంటారన్నది అంతిమంగా రాజకీయ విశ్లేషకులు తేల్చిన మాట.

ఇదే తేనెతుట్టను తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కదిపారు. కరీంనగర్‌ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజశ్వేరస్వామి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన మంచు మోహన్‌ బాబు.., త్వరలో నిర్మించనున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్టును అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామి వారిని మోహన్ బాబుతో పాటు ఆయన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు మంచు మనోజ్‌ కూడా దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… “రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఎన్టీఆర్’ తరువాత గొప్ప నేత ‘కేసీఆర్’ అని, తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమని, కేసీఆర్ మెరుగైన పాలన అందిస్తున్నారని” కితాబునిచ్చారు. ఇలా ఉన్నట్లుండి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించడంలో గల ఆంతర్యం ఏమిటో గానీ, మోహన్ బాబు వ్యాఖ్యలు మాత్రం పొలిటికల్ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసాయి. బహుశా కేసీఆర్ ను బుట్టలో వేసుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేసారేమో గానీ, మోహన్ బాబు అభిప్రాయంలో వాస్తవం లేదని టిడిపి వర్గాలు అంటున్నాయి.

మరో వైపు, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, బంధువుగా ఉన్న మోహన్ బాబు, వైసీపీ వర్గాలు మహానేతగా భావించే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును చెప్పకుండా కేసీఆర్ ను పొగడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక రకంగా ఈ వ్యాఖ్యలతో జగన్ కు జలక్ ఇచ్చినట్లేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే సినీ నటుడిగా ఉంటూ ఈ వ్యాఖ్యలు చేస్తే బహుశా అవగాహనరాహిత్యం అని భావించేవారేమో గానీ, త్వరలో మోహన్ బాబు పొలిటికల్ ‘రీ ఎంట్రీ’ ఖాయంగా కనపడుతున్న నేపధ్యంలో ‘కలెక్షన్ కింగ్’ వ్యాఖ్యలకు ప్రాధాన్యత లభించింది.

ఇంతకీ మీరేమంటారు..? ఎన్టీఆర్ తర్వాత స్థానం ఎవరిదీ..?