Mohammad_Farooq_Shibli_Minority_Leaderఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితికి అద్దం పడుతోంది ఈ కేసు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో నిరుపేద ముస్లిం యువతుల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం దుల్హన్ పేరుతో రూ.50,000 చొప్పున ఆర్ధికసాయం అందించేది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో హామీ ఇచ్చారు. కానీ నేటికీ దానిని అమలుచేయకపోవడంతో మైనార్టీ హక్కుల సంఘం నాయకుడు మహమ్మద్ ఫారూక్ షిబ్లీ ఈరోజు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఏపీ ప్రభుత్వం లక్ష రూపాయలు చెల్లించలేకపోగా గతంలో ఉన్న దుల్హన్ పధకాన్ని కూడా నిలిపివేసిందని కనుక ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణం దుల్హన్ పధకం ప్రారంభించి, లక్ష రూపాయలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా పిటిషనర్ మహమ్మద్ ఫారూక్ షిబ్లీ న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు.

అంతకు ముందు మహమ్మద్ ఫారూక్ షిబ్లీ హైకోర్టులో మరో పిటిషన్‌ కూడా వేశారు. దానిలో వైసీపీ ప్రభుత్వం విదేశీ విద్యాపధకాన్ని కూడా నిలిపివేసిందని, ఈ కారణంగా ప్రస్తుతం విదేశాలలో చదువుకొంటున్న 570 మంది విద్యార్దులు అక్కడ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ షుబ్లీ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. విదేశాలలో చిక్కుకుపోయి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ విద్యార్దుల కోసం ఆ పధకాన్ని కూడా తక్షణం పునరుద్దరించి వారినందరినీ ఆదుకోవాలని మహమ్మద్ ఫారూక్ షుబ్లీ కోరారు.

ఈ కేసుపై నేడు హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు ప్రభుత్వం తరపు వాదించిన న్యాయవాది, ‘ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం ఈ రెండు ఈ పధకాలను కొనసాగించలేకపోతోందని’ తెలిపారు. వీటిపై ప్రభుత్వాన్ని సంప్రదించి పూర్తి వివరణ ఇస్తామని హైకోర్టుకి తెలిపారు.

అనంతరం పిటిషనర్ మహమ్మద్ ఫారూక్ షిబ్లీ మీడియాతో మాట్లాడుతూ, “ఇవే కాదు…ఇంకా చాలా పధకాలను ప్రభుత్వం అమలుచేయడం లేదు. ఎన్నికలలో ఇచ్చిన చాలా హామీలను అమలుచేయడం లేదు. చివరికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలలో పేర్కొన పధకాలకు కూడా కత్తిరిస్తోంది.

ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనపధకంలో ముస్లిం విద్యార్దులు ఎందరు ఉన్నారో లెక్కగట్టి వారికి పెడుతున్న తిండిని కూడా మైనార్టీ సంక్షేమ పద్దులో చూపిస్తోంది ఈ ప్రభుత్వం.

ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం ఇస్తున్న పధకాల కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడేళ్ళవుతున్నా ఇంతవరకు ఆ హామీలు అమలుచేయకపోవడమే కాకుండా, ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది కనుక వాటిని అమలుచేయలేమని చెపుతుండటం మైనార్టీ ప్రజలను నమ్మించి మోసం చేయడంగానే మేము భావిస్తున్నాము. ఎన్నికలలో మైనార్టీ ఓట్ల కోసమే నోటికి వచ్చిన హామీలు ప్రకటించినట్లు అర్దమవుతోంది. అయితే ఈ పధకాలు అమలుచేసేవరకు మా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి,” అని మహమ్మద్ ఫారూక్ షిబ్లీ స్పష్టం చేశారు.