Moeen Ali 124 Run Win Over West Indiesఆదివారం నాడు క్రికెట్ అభిమానులకు ‘ఐ ఫీస్ట్’గా మారింది. ఓ పక్కన ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడవ వన్డే జరుగగా, మరో పక్కన ఇంగ్లాండ్ – వెస్టీండీస్ జట్లు కూడా మూడవ వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 124 పరుగుల తేడాతో అవలీలగా విజయం సాధించగా, ఇంతటి విజయానికి మొయిన్ అలీ కారణం అయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ జట్టు తొలి 6 వికెట్లను 217 పరుగులకే పడగొట్టింది. అయితే ఆ తర్వాత మొదలైంది అసలు విధ్వంసం.

రూట్ (84), స్టోక్స్ (73) పరుగులు చేయడంతో ఓవర్ 6 పరుగుల రన్ రేట్ తో ఎంత వేగంగా స్కోర్ బోర్డు కదిలిందో, అంతే వేగంగా వికెట్లు కూడా పడడంతో 300 మార్క్ నైనా అందుకుంటుందా? లేదా? అన్న సందేహాలకు మొయిన్ అలీ తెరదించాడు. వికెట్లు పడడంతో తొలుత నింపాదిగా ఆడిన అలీ, తను ఎదుర్కొన్న మొదటి 39 బంతులకు 39 పరుగులు చేయగా, సెంచరీని మాత్రం 53 బంతుల్లోనే పూర్తి చేసాడు. తర్వాత ఎదుర్కొన్న 14 బంతుల్లో 8 సిక్సర్లు కొట్టి ఏకంగా 61 పరుగులు చేసి సెంచరీ నమోదు చేసాడు.

దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టి ఏకంగా 369 పరుగుల వద్ద ఆగింది. మొత్తం 57 బంతులను ఎదుర్కొన్న అలీ 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేసి, మరో ఓవర్ ఉందనగా పెవిలియన్ చేరుకున్నాడు. భారీ లక్ష్య చేధనలో గేల్ ఒక్కడే 94 పరుగులతో ఒంటరి పోరాటం చేసాడు. 39.1 ఓవర్లలో 245 పరుగులు చేసి విండీస్ ఆలౌట్ అవ్వడంతో భారీ విజయం ఇంగ్లాండ్ వశమైంది. అద్భుతమైన సెంచరీతో మ్యాచ్ ను మలుపు తిప్పిన మొయిన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం కాగా, సిరీస్ ను ఇంగ్లాండ్ 2-0తో లీడ్ చేస్తోంది.