Modi wins opposition failsపెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోడీ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అయ్యిందో, ఫెయిల్ అయ్యిందో అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఈ నిర్ణయం వలన “సామాన్య ప్రజలు” తప్ప క్యూ లైన్ లో నిల్చున్న ఒక్క “పెద్ద మనిషి”ని కూడా చూడలేదన్నది నిర్వివాద అంశం. అవును… గత 24 రోజులుగా సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో పాత నోట్ల విలువ మొత్తం 11 లక్షల కోట్లు దాటి 12 లక్షల కోట్లకు చేరుకుంటున్న విషయం అధికారికమే. మరి ఈ ధనమంతా కేవలం సామాన్యులవేనా? అనే ఎవరైనా తెల్లముఖం వేయాల్సిందే.

మరి ఏ ఒక్క “బడా బాబు” కూడా క్యూ లైన్ లో నిల్చోకుండా నోట్లు ఎలా మారిపోయాయి? అంటే ‘అవకతవకలు జరిగిందనేది’ చర్చలకు తావు లేని అంశం. మరి ఈ అవకతవకలపై ఏ ఒక్క ప్రతిపక్షం కూడా ఎందుకు నోరు మెదపడం లేదు. ఎంతసేపటికి… మోడీ తీసుకున్న నిర్ణయం తప్పు అంటున్నారు… లేదంటే కొత్త కరెన్సీని అందుబాటులోకి తేకుండా సరిగా అమలు చేయడం సాధ్యం కాలేదంటున్నారు… అది కాదంటే… మాకు చెప్పకుండా నోట్లను రద్దు చేసారని మండిపడుతున్నారు తప్ప.., బ్యాంకు మేనేజర్ల చేతివాటం గురించి ఎందుకు నిలదీయడం లేదు? మార్కెట్ లో చలామణి అవుతోన్న “కమీషన్” కరెన్సీని ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రభుత్వాన్ని అడగడం లేదు?

సాధారణంగా ఏ చిన్న విషయం తమ చేతికి చిక్కినా అధికార పక్షాలను నిలదీయడానికి ప్రతిపక్షాలు ఎప్పుడూ ముందుంటాయి. మరి అలాంటిది కళ్ళ ముందే ఇంత అక్రమాలు జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదో ఇప్పటికీ దేశ ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. దీంతో అధికార పక్షం అమలు చేసిన విధానంలో ఎన్ని లోపాలు ఉన్నాయో, ప్రతిపక్షాల వ్యవహారతీరులో కూడా అంత కంటే ఎక్కువ బొక్కలే ఉన్నాయని దేశ ప్రజలకు తెలిసివచ్చింది. ఒక రకంగా ఫెయిల్ అయ్యింది నిర్ణయం తీసుకున్న మోడీ కాదు, దానిని వినియోగించుకునే అవకాశం లేని ప్రతిపక్షాలే అని స్పష్టమైంది.

రాజకీయ నాయకుల దగ్గర, బిగ్ షాట్స్ దగ్గర ‘బ్లాక్ మనీ’ లేదంటే… దేశంలో పుట్టిన పిల్లోడు కూడా నమ్మే పరిస్థితి లేదు. మరి అలాంటి బ్లాక్ మనీని అదుపు చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టినపుడు సహకరించకుండా ప్రతిపక్షాలు ఎందుకు విమర్శలు చేస్తున్నాయి? సామాన్యుడుపై నిజంగా అంత ప్రేమ, అభిమానం ఉంటే… దేశవ్యాప్తంగా దాదాపుగా చనిపోయిన 80 మంది సామాన్యుల ఇళ్ళకు ఎంతమంది ప్రతిపక్ష నేతలు వెళ్లి పరామర్శించారు? అంటే ప్రజల చావు కబుర్లు కావాలి గానీ, ప్రజలకు కష్టకాలంలో మాత్రం అండగా ఉండరు. ఆఖరికి “శవ రాజకీయాలు” చేయడానికి ప్రతిపక్ష పార్టీలు మొగ్గుచూపుతున్నాయన్న విషయం ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైంది.

ప్రతిపక్షాల వ్యవహారశైలితో వారు కూడా అక్రమ మార్గంలో నోట్లు మార్చుకున్నారన్న నిర్ణయానికి జనాలు వచ్చేసారు. అంటే ఓ వైపు రాజకీయ లబ్ది కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఏకరువు పెట్టడం… మరో వైపు ‘బ్యాక్ డోర్’ ద్వారా రావాల్సినదంతా రాబట్టుకోవడం. ఇది మన ప్రతిపక్ష పార్టీల బుద్ధిగా ప్రజలకు అవగతమైన విషయం. ఈ బ్యాక్ డోర్ ద్వారా వచ్చిన సొమ్మును అధికారికంగా ఖర్చు చేసే వీలు ప్రస్తుతానికి లేకపోవడంతో… ఈ సొమ్మంతా మార్కెట్ లో చలామణి అవ్వకుండా మళ్ళీ దాచిపెడుతున్నారు. అంటే దేశంలో ఏర్పడిన కరెన్సీ కొరతకు కారణం ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో!

అలాగని సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే విధంగా నిర్ణయం తీసుకున్న అధికార పక్షాన్ని సమర్ధించడం కాదు గానీ, “సామాన్య ప్రజల కోసమే మేము బ్రతుకుతున్నది… అందుకే మా ఆందోళనలు అని నెత్తి, నోరు కొట్టుకుంటూ సామాన్యుల శవాల సంఖ్యను లెక్కపెట్టుకుంటున్న ప్రతిపక్షాల తీరు” ప్రజల ముందు పెట్టే ప్రయత్నం.