Modi Replies Nagarjuna Tweetsదేశం మొత్తానికి షాక్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్న మోడీకి అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు నరేంద్ర మోడీని అభినందిస్తూ ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ వేదికలుగా తమ అభిప్రాయాలు పంచుకోగా, తాజాగా అక్కినేని నాగార్జున కూడా మోడీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసారు. “పారిస్ నుండి ట్వీట్ చేస్తున్నానని చెప్పిన నాగ్, పన్ను చెల్లింపుదారులకు గుర్తింపు ఇస్తున్నందుకు, బలమైన ఆర్ధిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నందుకు” శుభాకాంక్షలు తెలిపారు.

నాగ్ భావాలకు మోడీ సమాధానం కూడా ఇవ్వడం విశేషం. “దేశ అభివృద్ధి వేగాన్ని తగ్గిస్తున్న అవినీతి, నల్లధనం, ఫేక్ కరెన్సీ రాకెట్ లను నియంత్రించడానికి ఈ స్టెప్ వేశానని” మోడీ బదులిచ్చారు. ఒక్క నాగార్జునకే కాదు, దేశంలోని ఇతర ప్రముఖుల ట్వీట్లకు కూడా మోడీ స్పందించారు. రజనీకాంత్ ఇచ్చిన ట్వీట్ కు బదులుగా “కృతజ్ఞతలు తెలిపిన మోడీ, మనం ఒకరికొకరం భుజం భుజం కలిపి అవినీతి రహిత ఇండియాను సృష్టించాలని” పిలుపునిచ్చారు.

మోడీ బదులిచ్చిన వారి జాబితాలో కమల్ హాసన్, రితిష్ దేశ్ ముఖ్, కరణ్ జోహార్, మధుర భండార్కర్, అనిల్ కుంబ్లే, సుభాష్ ఘై, అజయ్ దేవ్ గణ్ తదితరులు ఉన్నారు. అయితే మన తెలుగు వారిలో మాత్రం నాగార్జున ఒక్కరే ఉండడం విశేషం. అయితే తెలుగు అగ్ర స్థాయి హీరోలలో నాగ్, మోహన్ బాబు మినహా పెద్దగా స్పందించిన వారు లేకపోవడం విశేషమే.