modi-on-indus-river-water-usage-pakisthanపాకిస్తాన్ పై ‘సర్జికల్ స్ట్రైక్’ చేసిన నాటి నుండి ఆకాశమే హద్దుగా… దేశ సంక్షేమమే ప్రధమ ఆశయంగా… ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఓ పక్కన పెద్ద నోట్లను రద్దు చేసి దేశంలోని నల్లకుభేరులకు కోలుకోలేని షాక్ ఇచ్చిన ప్రధాని, తాజాగా పాకిస్థాన్ కు తేరుకోలేని మరో భారీ పెద్ద షాక్ ఇచ్చారు. పాక్ కు జీవనాధారమైన సింధు నది జలాలను ఒక్క చుక్క కూడా ఆ దేశానికి వదలమని సంచలనమైన ప్రకటన జారీ చేసారు.

మన దేశం నుంచి వెళుతున్న సింధు నదీ జలాలు పాక్ గుండా వెళ్లి సముద్రంలో కలుస్తున్నాయని, అయితే ఆ జలాలను పూర్తిగా ఉపయోగించుకునే హక్కు మనకు ఉందని తెలిపిన ప్రధాని, ఆ నీళ్లను మన రైతులకు అందించే ప్రయత్నం చేస్తామని, “సింధూ జలాలు భారత హక్కు… ఆ నీళ్లను ఒక్క చుక్క కూడా పాక్ కు వెళ్ళనివ్వం” అనే నినాదాన్ని ప్రకటించారు. పంజాబ్ లోని భటిండాలో ఎయిమ్స్ శంకుస్థాపన సందర్భంగా ప్రసంగించిన బహిరంగ సభలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

1960లో జరిగిన ‘ఇండస్ ఒప్పందం’ ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు… ఇండస్ (సింధు), జీలం, చీనాబ్ నదులు పాక్ కు దక్కాయి. ఈ అంశానికి సంబంధించి ఇరు దేశాల అధికారులున్న ‘ఇండస్ వాటర్ కమిషన్’ను సస్పెండ్ చేయాలని మోడీ భావిస్తున్నారు. ఈ నదులన్నీ భారత్ మీదుగా పాకిస్థాన్ లోకి ప్రవేశిస్తున్నవే. ఈ విషయంపై మోడీ స్పష్టంగా మాట్లాడటంతో పాకిస్థాన్ లో అలజడి రేగింది. నిజంగా ఇదే జరిగితే… పాక్ లోని సారవంతమైన భూములన్నీ బీడుగా మారడం ఖాయం.

అసలే పాకిస్థాన్ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే… దీనికి తోడు ఇపుడు నీరు లేకపోతే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఓ పక్కన సరిహద్దు ప్రదేశాల్లో పాకిస్తాన్ కాల్పుల ఒప్పందం ఉల్లంఘింస్తుండడంతో… క్షేత్ర స్థాయిలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు కొన్ని కఠినతరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా మోడీ ఆలోచనలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.